హ్యూమన్ రైట్స్ టుడే/దిల్లీ: భారత గణతంత్ర వేడుకలకు (Republic Day Celebrations) ముఖ్య అతిథిగా ఈజిప్ట్ అధ్యక్షుడు (Egypt President) అబ్డెల్ ఫత్తాహ్ ఎల్‌సిసి (Abdel Fattah el-Sisi) హాజరు కానున్నారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈజిప్ట్ నుంచి ఓ నేత గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనడం ఇదే తొలిసారి. అంతేకాకుండా పశ్చిమ ఆసియా, అరబ్ దేశాల నుంచి హాజరైన ఐదో వ్యక్తి అబ్డెల్. కేంద్రప్రభుత్వ వర్గాలు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్డెల్ జనవరి 24నే దిల్లీకి చేరుకుంటారు. విదేశాంగ శాఖ సహాయ మంత్రి రాజ్‌కుమార్ రంజన్ ఆయనకు స్వాగతం పలుకుతారు. అనంతరం ప్రధాని మోదీతో ఆయన సమావేశమవుతారు. ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించనున్నారు. అనంతరం మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడితో సమావేశమవుతారు. అదేరోజు రాత్రి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గౌరవ పూర్వకంగా ఇచ్చిన విందుకు ఆయన హాజరవుతారు.
అబ్డెల్ ముఖ్య అతిథిగా హాజరవుతున్న నేపథ్యంలో ఈజిప్ట్ దేశానికి చెందిన 180 మంది సైనికులు గణతంత్ర దినోత్సవ కవాతులో పాల్గొననున్నారు. అంతేకాకుండా భారత్, ఈజిప్ట్ దేశాల మధ్య కుదిరిన పలు ఒప్పందాలపై ఈ సందర్భంగా ఇరుదేశాల అధికారులు సంతకాలు చేయనున్నారు. భారత్, ఈజిప్ట్ దేశాల మధ్య 75 సంవత్సరాల దౌత్యసంబంధాలకు గుర్తుగా ఓ స్టాంప్‌ను విడుదల చేయనున్నారు.
ఈజిప్ట్ అధ్యక్షుడి పర్యటన సందర్భంగా ఇరు దేశాల ఆర్థిక సంబంధాలపైన, ముఖ్యంగా గోధుమల సరఫరాపై చర్చించే అవకాశముంది. ఉక్రెయిన్, రష్యా నుంచి దిగుమతి చేసుకుంటున్న ఈజిప్ట్‌కు గతంలో భారత్ గోధుమలు నుంచి ఎగుమతి అయ్యేవి కాదు. అయితే, గత ఏడాది ఈజిప్ట్ నిషేధాన్ని ఎత్తివేసిన తర్వాత మూడు విడతల్లో 61 వేల టన్నుల గోధుమలను ఎగుమతి చేసేందుకు భారత్ అనుమతించింది. తేజస్, ఆకాశ్ లాంటి అధునాతన తేలికపాటి యుద్ధ హెలికాప్టర్లను కొనుగోలుకు ఈజిప్ట్ ఆసక్తి కనబరుస్తున్న నేపథ్యంలో ఇరుదేశాల మధ్య రక్షణ సంబంధిత అంశాలపైనా చర్చించే అవకాశమున్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో తదుపరి చర్చల కోసం హిందూస్థాన్ ఏరోనాటిక్స్ (HAL) అధికారులతో ఈజిప్ట్ అధికారులు సంప్రదింపులు జరిపే అవకాశముంది.