ఫోన్లలో ట్రూకాలర్‌ తరహా ఫీచర్‌.. టెలికాం కంపెనీలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి?

Get real time updates directly on you device, subscribe now.

హ్యూమన్ రైట్స్ టుడే/దిల్లీ: అవతలి నుంచి ఎవరు ఫోన్‌ చేస్తున్నారో తెలియాలంటే ట్రూకాలర్‌ వంటి థర్డ్‌పార్టీ యాప్ ఉండాల్సిందే. అలాంటి అవసరం లేకుండా టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్‌ (Trai) కొత్త ఫీచర్‌ను తీసుకొస్తోంది. ఎలాంటి యాప్‌ సాయం లేకుండా అవతలి వ్యక్తి ఎవరనేది ఫోన్ డిస్‌ప్లేపై తెలిసిపోతుంది. ఇందుకోసం టెలికాం కంపెనీల వద్ద ఉండే రిజిస్ట్రేషన్‌ డేటాను వినియోగించాలని భావించింది. అయితే, దీనిపై టెలికాం కంపెనీలు ప్రతికూలంగా స్పందించాయి. కాలింగ్ నేమ్‌ ప్రజంటేషన్‌ (CNAP) పేరుతో వస్తున్న ఈ ఫీచర్‌ వల్ల యూజర్ల గోప్యతకు భంగం వాటిల్లుతుందని తెలిపాయి. సాంకేతికంగా కొన్ని అవరోధాలు ఉన్నట్లు పేర్కొన్నాయి. ఈ విషయంలో తమకున్న అభ్యంతరాలను జియో (Jio), ఎయిర్‌టెల్‌ (Airtel), బీఎస్‌ఎన్‌ఎల్‌ (BSNL), వొడాఫోన్‌ ఐడియా (Vi) వేర్వేరుగా తమ స్పందనను ట్రాయ్‌కు తెలియజేశాయి.

ఈ ఫీచర్‌ వల్ల డేటా గోప్యత, సాంకేతిక ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని జియో తెలిపింది. చాలా వరకు ఫోన్లు కాలింగ్‌ నేమ్‌ ప్రజెంటేషన్‌ (CNAP)కి సపోర్ట్‌ చేయవని పేర్కొంది. ఆపరేటింగ్‌ సిస్టమ్‌ నుంచి కూడా ఇబ్బందులు ఉన్నాయని తన అభిప్రాయాన్ని ట్రాయ్‌కి తెలియజేసింది. దీనివల్ల నెట్‌వర్క్‌పై కూడా భారం పడుతుందని పేర్కొంది. ఈ ఫీచర్‌ వల్ల వ్యక్తిగత భద్రతకు సంబంధించిన సమస్యలు తలెత్తుతాయని ఎయిర్‌టెల్‌ తెలిపింది. కాల్‌ సెటప్‌ సమయం ఎక్కువగా తీసుకోవటంతో యూజర్లు అసంతృప్తి చెందే అవకాశం ఉందని తెలిపింది. ఈ ఫీచర్‌ కోసం వేరేగా స్టోరేజ్‌ను ఉంచాల్సి ఉంటుందని, టెల్కోలకు ఆ మేర భారం పడుతుందని తెలిపింది. కాలర్‌ ఐడీ ఫీచర్‌ని ఈ దశలో తప్పనిసరి చేయటం సరైనది కాదని ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌ తెలిపింది. ఆరంభంలో ఈ సర్వీసుని వాల్యూ యాడెడ్‌ సర్వీసుగా అందించాలని పేర్కొంది. జియో, ఎయిర్‌టెల్‌, బీఎస్‌ఎన్‌ఎల్‌ తరహాలోనే వొడాఫోన్‌ సైతం అభ్యంతరాలను తెలియజేసింది. ఎల్‌టీఈ నెట్‌వర్క్‌ ఫీచర్‌ అని, 2జీ, 3జీ నెట్‌వర్క్‌కు అనుసంధానం చేయడం సాధ్యంకాదని తెలిపింది. ఇందుకు నెట్‌వర్క్‌, ఐటీ సిస్టమ్స్‌ను వినియోగించాల్సి ఉంటుందని పేర్కొంది.

Get real time updates directly on you device, subscribe now.

Leave a comment