– కోవిడ్ తర్వాత భారీగా బంగారం రుణాలు
– ప్రభుత్వ అసమర్ధ విధానాలే కారణం
– పెరగని వేతనాలు…పెరిగిన ఖర్చులు
– గరిష్ట స్థాయికి రుణభారం
– కాంగ్రెస్ మీ మంగళ సూత్రాన్ని లాక్కొంటుంది జాగ్రత్త
హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/ఏప్రిల్ 26: కాంగ్రెస్ పార్టీ హిందూ మహిళలు ధరించిన బంగారు తాళి బొట్లను లాక్కొని వాటిని దేశంలోకి చొరబడిన ముస్లిం మహిళలకు అందజేస్తుందంటూ ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల తీవ్ర వ్యాఖ్య చేసిన విషయం తెలిసిందే. అయితే మోడీ పాలనలో వాస్తవంగా ప్రభుత్వం అమలు చేస్తున్న అనర్థదాయకమైన విధానాల కారణంగా కార్మిక కుటుంబాలకు చెందిన మహిళల మంగళసూత్రాలు, ఇతర బంగారు ఆభరణాలు సంపన్నుల ఖజానాకు చేరుతున్నాయి.
న్యూఢిల్లీ: హిందూ సమాజంలోనే రోజువారీ వేతనాలు తెచ్చుకుంటున్న వారి నుండి సంపన్నుల వరకూ బంగారు ఆభరణాల బదిలీ ఎక్కువగా జరుగుతుంటుంది. రిజర్వ్‌బ్యాంక్ వద్ద ఉన్న సమాచారం ఈ వాదనకు బలం చేకూరుస్తోంది. కుటుంబ అవసరాల కోసం అనేక మంది మహిళలు తమ వద్ద ఉన్న బంగారు ఆభరణాలను బ్యాంకులలో తాకట్టు పెట్టి రుణాలు తీసుకుంటారు. ముఖ్యంగా కోవిడ్ తర్వాత ఈ ధోరణి అధికంగా కన్పిస్తోంది. ఉద్యోగాలు పోవడం, ఆదాయాలు లేకపోవడంతో అనేక పేద, మధ్య తరగతి కుటుంబాలు విధిలేని పరిస్థితులలో బంగారు ఆభరణాలను బ్యాంకులు, వడ్డీ వ్యాపారుల వద్ద తాకట్టు పెట్టి డబ్బు తీసుకుంటున్నాయి. 2020 సెప్టెంబర్, 2021 సెప్టెంబర్ మధ్యకాలంలో బంగారు ఆభరణాలపై తీసుకున్న రుణాల సంఖ్య సుమారు 60 శాతం పెరిగిందని ఆర్‌బీఐ లెక్కలు చెబుతున్నాయి. మరో మాటలో చెప్పాలంటే రుణాలు రూ.40,080 కోట్ల నుండి రూ.63,770 కోట్లకు పెరిగాయి.
కోవిడ్ తర్వాత మోడీ ప్రభుత్వం సామాన్య కార్మిక కుటుంబాల చేతిలో చాలినంత డబ్బు ఉంచకపోవడమే దీనికి ప్రధాన కారణం. వ్యాపారాలకు భారీగా రుణ రాయితీలు అందించడం పైనే ప్రభుత్వం దృష్టి సారించింది తప్ప సామాన్యుల బాధలు పట్టించుకోలేదు. బంగారాన్ని తాకట్టు పెట్టి రుణాలు తీసుకోవడం గతంలో కూడా జరిగిందే. కానీ కోవిడ్ తర్వాత ఆ తరహా రుణాలు భారీగా పెరిగాయి. జనాభాలో చివరి 70 శాతం ప్రజల ఆదాయాలు పెరగకపోవడం, స్థిరంగా ఉండడమే దీనికి కారణం. 2017-18, 2022-23 మధ్యకాలంలో నెలసరి, దినసరి ఆదాయం పొందే వారి వాస్తవ వేతనాలు తగ్గాయని ప్రభుత్వ పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే (పీఎల్‌ఎఫ్‌ఎస్) చెబుతోంది. కుటుంబాల రుణభారం పెరగడం, పొదుపు తగ్గిపోవడంపై ఆర్‌బీఐ ఆందోళన వ్యక్తం చేసిన సమయంలోనే బంగారంపై తీసుకున్న రుణాల సంఖ్య పెరగడం ఆశ్చర్యాన్ని కలిగించలేదు.
కాబట్టి మంగళసూత్రాల బదిలీ ప్రభుత్వ విధానాలలో మార్పుల కారణంగా జరిగినదే. పెద్ద నోట్ల రద్దు, కోవిడ్ వంటి పరిణామాల సమయంలో ప్రభుత్వం సమర్ధవంతంగా వ్యవహరించలేకపోవడం కూడా ఈ పరిస్థితికి కారణమైంది. కోవిడ్ సమయంలో కుటుంబాల రుణభారం గరిష్ట స్థాయికి చేరింది. ఆదాయ అసమానతలు పెరిగిపోయాయి. అదే కాలంలో గ్రామీణ వేతనాలు, వినియోగం స్థిరంగా ఉండిపోయాయి.
ఆర్‌బీఐ ఆందోళన
పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ విధింపు కారణంగా పరిస్థితి మరింత దిగజారింది. వినియోగ పన్నులో 65 శాతం వాటా కలిగిన కార్మిక వర్గంపై జీఎస్టీ రేట్లు ప్రతికూల ప్రభావం చూపాయి. కార్మికుల వేతనాలు స్థిరంగా ఉండడంతో బంగారు ఆభరణాలపై రుణాలు తీసుకోవడం ఎక్కువైంది. బంగారాన్ని తాకట్టు పెట్టి తీసుకునే రుణాలను నిశితంగా పరిశీలించాలంటూ ఆర్‌బీఐ ఇటీవల బ్యాంకులు, బ్యాంకింగ్ యేతర ఆర్థిక సంస్థలకు సూచించింది. ఎందుకంటే గత ఏడెనిమిది సంవత్సరాల కాలంలో బంగారు ఆభరణాలపై తీసుకున్న రుణాలు అనేక రెట్లు పెరిగాయి. ఈ ధోరణి ఇలాగే కొనసాగితే కుటుంబాల రుణభారం మరింత పెరుగుతుందని, పొదుపు తగ్గిపోతుందని, అభివృద్ధిపై, వినియోగంపై ప్రభావం పడుతుందని ఆర్‌బీఐ అభిప్రాయపడుతోంది.
విధిలేని పరిస్థితులలో…
హిందూ సంప్రదాయంలో మంగళసూత్రానికి సెంటిమెంట్ పరంగా ఎంతో ప్రాధాన్యత ఉంది. అలాంటి మంగళసూత్రాలను మహిళలు బ్యాంకులు, వడ్డీ వ్యాపారుల వద్ద తాకట్టు పెట్టి రుణాలు తీసుకోవాల్సిన దుస్థితి ఏర్పడుతోంది. తీసుకున్న రుణాలు తిరిగి చెల్లించలేకపోవడంతో భూమి లేదా ఇంటిని వడ్డీ వ్యాపారులు స్వాధీనం చేసుకుంటున్న సందర్భాలు అనేకం. దానిని నివారించడానికి ఎంతో పవిత్రంగా భావించే మంగళసూత్రాన్ని సైతం కుదువ పెట్టాల్సి వస్తోంది. కాంగ్రెస్‌ను ఆడిపోసుకోవడానికి బదులు ప్రధాని మోడీ ఈ విషయంపై దృష్టి సారిస్తే మంచిదేమో.
మోడీ సెల్ఫ్ గోల్ మంగళసూత్రాల విషయాన్నిఅటుంచితే వారసత్వ పన్నుపై కాంగ్రెస్‌ను విమర్శించిన మోడీ సెల్ఫ్ గోల్ చేసుకున్నారు. ఎందుకంటే ఈ పన్ను విధింపుపై గతంలో పరిశీలించింది ఆయన ప్రభుత్వమే. ఆదాయ పంపిణీ గురించి కూడా మోడీ తన ఎన్నికల ప్రచార సభలలో ప్రస్తావిస్తున్నారు. తొలి దశ పోలింగ్‌లో తక్కువ ఓటింగ్ నమోదు కావడంతో కలత చెందిన కమలదళం, ఇప్పుడు హిందూత్వ కార్డును బయటికి తీసి ఓటర్లను పెద్ద సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు రప్పించే ప్రయత్నం చేస్తోంది.