హ్యూమన్ రైట్స్ టుడే/నిజామాబాద్ జిల్లా/ఏప్రిల్ 20:
నిజామాబాద్ జిల్లా కమ్మర్ పల్లిమండలంలో శనివారం ఉదయం వర్షం బీభత్సం సృష్టించింది. సుమారు 40 నిమిషాలపాటు బలమైన ఈదురు గాలులతో కురిసిన భారీ వర్షంతో పలు పంటలకు నష్టం వాటిల్లింది.
పలుచోట్ల బలంగా వీచిన ఈదురు గాలులకు వరి, జొన్న, నువ్వు పంటలు నేల వాలాయి. వరి కోతలు కొనసాగుతున్నందున రోడ్లపై ఆరబెట్టిన వరి ధాన్యం భారీ వర్షానికి తడిసిపోయింది.
పలువురు రైతులు వరి ధాన్యాన్ని కాపాడుకునేందుకు ప్లాస్టిక్ కవర్లను కప్పి ఉంచినప్పటికీ ఈదురు గాలుల మూలంగా కవర్లు తొలగిపోవడంతో ధాన్యం తడవగా, మరికొందరు రైతులకు సంబంధించిన మరి దాన్ని ప్లాస్టిక్ కవర్లు ఉన్నప్పటికీ భారీ వర్షం మూలంగా అడుగు భాగంలో ఉన్న ధాన్యం తడిసింది.
బలంగా వీచిన ఈదురు గాలులతో కూడిన వర్ష మూలంగా పలుచోట్ల చెట్లు వేర్లతో సహా, మరి కొన్ని చెట్ల కొమ్మలు విరిగి రోడ్డుకు అడ్డంగా పడ్డాయి. భారీ వర్షం, బలంగా వేచిన ఈదురుగాలుల మూలంగా వరి పంటకు పెద్ద ఎత్తున నష్టం వాటిల్లినట్లు రైతులు వాపోతున్నారు.
కోతకు వచ్చిన వరి గింజలు నేలరాలడంతో రైతులు దిక్కుతోచని పరిస్థితుల్లో పడిపోయారు. చేతికొచ్చింది అనుకున్న పంట చెడగొట్టు వానల మూలంగా నేల పాలవ్వడంతో లక్షల్లో నష్టం వాటిల్లినట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తడిసిన వరి ధాన్యం రంగు మారి, మొలకలు వస్తే కొను గోలు కేంద్రాల్లో మద్దతు ధర లభించక ఇబ్బందులు ఎదురవుతాయని రైతుల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అకాల వర్షాల మూలంగా నష్టపోయిన పంటలకు నష్ట పరిహారం అందించి ఆదుకోవాలని రైతులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.