మహిళలకు అధికారం అందని ద్రాక్షే నా ❓️

Get real time updates directly on you device, subscribe now.

హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/ఏప్రిల్ 17: దేశంలోని ప్రతి రాజకీయ పార్టీ మహిళల ఓట్లపై ప్రధానంగా దృష్టి పెడుతుంది. ఇందు కోసం మహిళా సాధికారత, వారికి 33 శాతం రిజర్వేషన్లు, హక్కులు వంటి అంశాలపై చుట్టూ రాజకీయాలు నడుపుతుంది.

కానీ, నిజ జీవితంలో మాత్రం అవేమీ కార్యరూపం దాల్చటం లేవు. ఇందుకు రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా గుజరాత్‌లోని ప్రధాన పార్టీలు బీజేపీ,కాంగ్రెస్‌లు మహిళలకు కేటాయించిన అతి తక్కువ సీట్లే ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం. ఈ రెండు పార్టీలు ఈ సారి నలుగురు చొప్పున మహిళలను లోక్‌సభ బరిలో నిలిపాయి.

ముఖ్యంగా, చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌ కల్పించటం, అందుకు పార్లమెంటులో చట్టం చేయటం అన్నీ తమ కారణంగానే అని చెప్పుకునే బీజేపీ సాక్షాత్తూ ప్రధాని మోడీ సొంత రాష్ట్రంలోనే వారికి మహిళలకు సీట్లు కేటాయించటంలో విముఖతను చూపుతుండటం గమనార్హం.

ఈ సారి బీజేపీ నలుగురు, కాంగ్రెస్‌ నలుగురు మహిళలను తమ పార్టీల నుంచి లోక్‌సభ ఎంపీ అభ్యర్థులుగా పోటీలో ఉంచాయి. గుజరాత్‌లో దాదాపు 2.39 కోట్ల మంది మహిళా ఓటర్లు ఉన్నారు. మొత్తం నమోదైన ఓటర్లలో 50 శాతం మంది వారే అయినప్పటికీ చెప్పు కోదగిన సంఖ్యలో కూడా ప్రధాన పార్టీలు మహిళలకు లోక్‌సభ సీట్లను కేటాయిం చక పోవటాన్ని మేధావులు, స్త్రీ అభ్యుదయవాదులు తప్పుబడుతున్నారు.

2019 లోక్‌సభ ఎన్నికల్లో గుజరాత్‌లోని మొత్తం 26 లోక్‌ సభ స్థానాల్లో బీజేపీ నుంచి ఆరుగురు మహిళా ఎంపీలు గెలిచారు. అయితే ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో ఆ పార్టీ నలుగురికి మాత్రమే పరిమితం కావటాన్ని మహిళా వాదులు వేలెత్తి చూపుతున్నారు. గుజరాత్‌లో మహిళా ఎంపీలు, అభ్యర్థుల ప్రాతినిధ్యం క్రమంగా క్షీణిస్తున్నది.

26 స్థానాలకు గానూ ప్రస్తుతం బీజేపీ నామినేట్‌ చేసిన నలుగురు మహిళలలో జామ్‌నగర్‌ స్థానానికి పూనమ్‌ మేడమ్‌, సబర్‌కాంతా స్థానానికి శోభనా బరయ్య, భావ్‌నగర్‌ స్థానానికి నీము బంభా నియా, బనాస్‌ కాంతా స్థానానికి రేఖాబెన్‌ చౌదరి ఉన్నారు.

ముఖ్యంగా, ఉత్తర గుజరాత్‌లోని బనస్కాంత స్థానానికి బీజేపీ మహిళా అభ్యర్థిపై కాంగ్రెస్‌ మహిళ అభ్యర్థి పోటీ చేయనున్నారు. గుజరాత్‌లో బీజేపీ, కాంగ్రెస్‌ రెండూ ఒకరిపై ఒకరు మహిళా అభ్యర్థులను నిలబెట్టిన ఏకైక సీటు ఇదే కావటం గమనార్హం.

ఇక కాంగ్రెస్‌ పార్టీ ప్రతిపాదించిన నలుగురు మహిళా అభ్యర్థుల్లో జెనీబెన్‌ ఠాకోర్‌ బనస్కాంత స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. అలాగే, కేంద్ర హౌంమంత్రి అమిత్‌ షా పోటీ చేస్తున్న గాంధీనగర్‌ స్థానం నుంచి సోనాల్‌ పటేల్‌ను కాంగ్రెస్‌ పోటీకి దింపింది. మిగతా రెండు స్థానాలైన అమ్రేలిలో జెని తుమ్మర్‌, దాహౌద్‌లో ప్రభా తవియాడ్‌లు ఉన్నారు. గుజరాత్‌లో అహ్మదాబాద్‌ వెస్ట్‌, గాంధీనగర్‌, పోర్‌ బందర్‌, పటాన్‌, పంచ మహల్‌, ఖేడా, బరూచ్‌, వల్సాద్‌, నవ్‌సారి స్థానాల్లో ఇప్పటివరకు ఏ పార్టీ నుంచి కూడా మహిళా అభ్యర్థి ఎన్నిక కాకపోవటం గమనార్హం.

రాజకీయ పార్టీలకు గెలుపు, అధికారం తప్పితే మహిళలకు సరైన ప్రాతినిధ్యం కల్పించాలన్న ఆసక్తి ఉండదని మేధావులు, విశ్లేషకులు అంటున్నారు. మహిళపై మరొక మహిళను నిలబెట్టటం, ఓడిపోయే స్థానాల్లోనూ మహిళనే బరిలో ఉంచి కంటి తుడుపు చర్యగా సీట్లను కేటాయిస్తున్నారని చెప్తున్నారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a comment