అదుపులోకి రాని మంటలు..
భవనం కూలే ప్రమాదం ఉందన్న డీఆర్ఎఫ్ చీఫ్
డెక్కన్ స్టోర్‌లో చెలరేగిన మంటలు
సికింద్రాబాద్ పరిధిలోని రాంగోపాల్‌పేట డెక్కన్ స్టోర్‌లో చెలరేగిన మంటలు ఇంకా అదుపులోకి రావడం లేదు. దాదాపు ఆరు గంటలు కావొస్తున్నా అగ్నికీలలు ఇంకా ఎగిసిపడుతూనే ఉన్నాయి. డెక్కన్ స్పోర్ట్స్ భవనంలో ఉదయం 11.30 గంటల సమయంలో ప్రమాదం జరిగిన విషయం తెలిసింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలు అదుపులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. మంటల తీవ్రత ఎక్కువగా ఉండడంతో రెస్క్యూ ఆపరేషన్ కష్టంగా మారింది.
ప్రస్తుతం సంఘటనా స్థలంలో 20 ఫైరింజన్లను అధికారులు మోహరించి.. భవనం మూడువైపులా మోహరించి.. మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు శ్రమిస్తున్నారు. మరో వైపు రసాయనాలతోనూ అగ్నికీలలను అదుపు చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. భారీ పొగ, మంటల కారణంగా భవనం వద్దకు వెళ్లేందుకు ఇబ్బంది ఎదురవుతున్నది. పొగ కారణంగా ఇద్దరు అగ్నిమాపక సిబ్బంది అస్వస్థతకు గురవగా.. వారిని ఆసుపత్రికి తరలించారు.
ప్రస్తుతం మంటలు భారీగా ఎగిసిపడుతుండడంతో రెస్క్యూ ఆపరేషన్ కష్టంగా మారింది. ముందస్తు జాగ్రత్తగా అధికారులు ఆ ప్రాంతంలో విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. భవనం పరిసరాల్లోకి ఎవరూ రాకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు. అలాగే ఐదు అంబులెన్స్‌లను సంఘటనా స్థలం వద్ద సిద్ధంగా ఉంచారు. సహాయక చర్యలను జీహెచ్‌ఎంసీ, రెవెన్యూ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. అగ్నిప్రమాదంపై రాంగోపాల్‌పేట పోలీసులు కేసు నమోదు చేశారు.
ఈ సందర్భంగా జీహెహెచ్‌ఎంసీ డీఆర్‌ఎఫ్ చీఫ్ కంపాటి విశ్వజీత్ మాట్లాడుతూ.. మంటల ఉధృతి ఎక్కువగా ఉండడంతో భవనం వద్దకు ఫైరింజన్లు వెళ్లలేని పరిస్థితి ఉందన్నారు. ఈ క్రమంలో రెస్క్యూ ఆపరేషన్ ఆలస్యమవుతుందని చెప్పారు. ప్రాణనష్టం జరుగకుండా చుట్టుపక్కల వారిని ఖాళీ చేయిస్తున్నట్లు తెలిపారు. అవసరమైతే బిల్డింగ్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటామన్నారు. భవనం ఏక్షణమైనా కూలిపోయే ప్రమాదం ఉందని, కూలిపోయినా ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని పేర్కొన్నారు.