హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/మార్చ్19: బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్‌ను మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తీవ్రంగా ఖండించారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ టార్గెట్‌గానే ఇవన్నీ జరుగుతున్నాయన్నారు. బ్యాంక్‌లకు లక్షల కోట్లు ఎగ్గొట్టి విదేశాలకు పారి పోయినవారున్నారని అన్నారు. అధికారంలో ఉన్నామని భయ బ్రంతులకు గురిచేసి పార్టీలో చేర్చుకుంటామంటే కుదరదన్నారు. అసమానతలు, అణిచివేత ఉన్నందునే నక్సల్ బరి నుంచి తెలంగాణ ఉద్యమం వరకు పుట్టుకొచ్చాయని చెప్పుకొచ్చారు. ఈ గడ్డపై మరో ఉద్యమం పుట్టడం ఖాయమన్నారు. అన్ని వర్గాలను కడుపులో పెట్టుకుని కాపాడుకుంది కేసీఆర్ మాత్రమే అని శ్రీనివాస్‌గౌడ్ స్పష్టం చేశారు.
రేవంత్ విర్రవీగే మాటలు మానుకో: ఈశ్వర్
సీఎం రేవంత్ రెడ్డి విర్రవీగే మాటలు మానుకోవాలని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ వ్యాఖ్యలు చేశారు. గత సీఎం కేసిఆర్ తప్పు చేసినట్లు చెప్పడం మూర్ఖత్వమన్నారు. ఎంక్వైరీల పేరుతో గత పథకాలు ఎగ్గొడుతున్నారన్నారు. దళిత బంధు, గొర్రెల పంపిణీ ఆపేశారని మండిపడ్డారు. ఇస్తరో ఇవ్వరో ఆ వర్గాలకు సమాధానం చెప్పాలన్నారు. ఆరు గ్యారంటీలు అమలు చేయకుండా సీఎం చిల్లరగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి భాషపై క్రిమినల్ కేసుపెట్టి జైల్‌కు పంపాలని కొప్పుల ఈశ్వర్ డిమాండ్ చేశారు.