హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/మార్చ్11: గత కేసీఆర్ ప్రభుత్వంలో స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచి (ఎస్ఐబీ) డీఎస్పీగా పనిచేసిన దుగ్యాల ప్రణీత్ రావు కేసు దర్యాప్తులో పోలీసులు వేగం పెంచారు. ఈ కేసు విచారణ సమయంలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. దర్యాప్తులో భాగంగా ప్రణీత్ రావుపై పంజాగుట్ట పోలీసులు ఈరోజు(ఆదివారం) కేసు నమోదు చేశారు. ఆయనతో పాటు మరికొంత మందిపై కేసు నమోదు చేశారు. ఎస్ఐబీ అదనపు ఎస్పీ డి.రమేష్ ఫిర్యాదు మేరకు ఈ కేసును పోలీసులు నమోదు చేశారు. ఎస్ఐబీ కార్యాలయంలోని రెండు గదుల్లో ఉన్న 17 కంప్యూటర్లను ప్రణీత్‌రావు అనధికారికంగా రహస్య సమాచారాన్ని సేకరించినట్లు అధికారులు గురించారు.
ఇటీవల స్వాధీనం చేసుకున్న కొన్ని కంప్యూటర్లలో కీలక రికార్డులు మాయమైనట్లు అధికారులు గుర్తించారు. ఎలక్ట్రానిక్ డివైసుల్లోని డేటా, ఇతర డాక్యుమెంట్లు మాయ కావడం పోలీసుశాఖతో పాటు రాజకీయ వర్గాల్లోనూ ఈ వ్యవహరం చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత తన వద్ద ఉన్న సమాచారాన్ని ఇతర హార్డ్ డిస్కుల్లోకి ప్రణీత్ రావు మార్చుకున్నట్లు అధికారులు గుర్తించారు. ప్రణీత్ రావు మీద ఏపీసీ 409, 427, 201, 120(బీ), పీడీపీపీ, ఐటీ యాక్ట్‌లను పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో SIB (స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్) డీఎస్పీగా పని చేసిన దుగ్యాల ప్రణీత్ రావు సస్పెండ్ అయిన విషయం తెలిసిందే. ఈ మేరకు తెలంగాణ డీజీపీ రవి గుప్తా ఉత్తర్వులు జారీ చేశారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధుల ఫోన్లు టాప్ చేసినట్లు ఆయనపై పెద్దఎత్తున ఆరోపణలు వచ్చాయి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభుత్వం మారటంతో ఆయన వ్యవహారశైలిపై విచారణ చేయించారు. విచారణలో అది నిజమని తేలటంతో తాజాగా ఆయనను తెలంగాణ ప్రభుత్వం సస్పెండ్ చేసింది.