పొత్తులపై మాయావతి సంచలన ప్రకటన..
హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/మార్చ్ 09:
కొన్ని రోజుల క్రితమే తాము బహుజన్ సమాజ్ పార్టీతో కలిసి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తామని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పేర్కొన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ విషయంపై బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌తో చర్చలు కూడా జరిపారు. కానీ తాజాగా బీఆర్ఎస్కి షాకిస్తూ బీఎస్పీ చీఫ్ మాయావతి సంచలన ప్రకటన చేశారు. తాము లోక్‌సభ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తున్నామని ఇండియా కూటమి లేదా ఏ ఇతర పార్టీతోనూ పొత్తు పెట్టుకోవడం లేదని క్లారిటీ ఇచ్చారు.
‘‘దేశంలో జరిగే లోక్‌సభ ఎన్నికల్లో బీఎస్సీ పూర్తి సన్నద్ధత, బలంతో పోటీ చేయబోతోంది. మేము ఇండియా కూటమి లేదా థర్డ్ ఫ్రంట్ లేదా ఏ ఇతర పార్టీతో కలిసి పొత్తు పెట్టుకోవడం లేదు. అవన్నీ తప్పుడు వార్తే. ఇలాంటి అసత్య వార్తలు రాసి, మీడియా తన విశ్వసనీయతను కోల్పోకూడదు. ప్రజలు సైతం అప్రమత్తంగా ఉండాలని’’ అని ఎక్స్ వేదికగా మాయావతి చెప్పుకొచ్చారు. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్‌లో బీఎస్పీ పూర్తి బలంతో బరిలోకి దిగుతుండటంతో ప్రతి పక్షాలకు కంటి మీద కునుకు లేకుండా పోయిందని విరుచుకుపడ్డారు. అందుకే వాళ్లు పుకార్లు పుట్టించి, ప్రజల్ని తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. బహుజన వర్గాల ప్రయోజనాల దృష్ట్యా తమ పార్టీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేయాలని దృఢంగా నిర్ణయించుకుందని మాయావతి తన ట్వీట్లో రాసుకొచ్చారు.
ఈ ప్రకటనతో బీఆర్ఎస్ పార్టీకి గట్టి షాక్ తగిలినట్లయ్యింది. నిజానికి తెలంగాణలో బీఎస్పీతో కలిసి పని చేయాలని నిర్ణయించుకున్న తర్వాత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌తో కలిసి కేసీఆర్ చర్చలు జరిపారు. అనంతరం తమ మధ్య గౌరవప్రదమైన పొత్తు కొనసాగుతుందని మీడియా సాక్షిగా ప్రకటించారు. బీఎస్పీ హైకమాండ్‌తో ప్రవీణ్ కుమార్ మాట్లాడి మరీ అనుమతి తీసుకున్నారని ఆ తర్వాతే ఇరు పార్టీలు కలిసి పని చేయాలని నిర్ణయించామని చెప్పారు. నాగర్‌కర్నూల్‌లో బిఎస్పీకి మద్దతు ఇవ్వాలని కూడా డిసైడ్ అయ్యారు. కానీ ఇంతలోనే ఎవరితోనూ పొత్తు ఉండదని మాయావతి తేల్చి చెప్పడంతో బీఆర్ఎస్ అయోమయంలో పడింది.