నేటి నుండి 24 వరకు జాతీయ రహదారి భద్రత వారోత్సవాలు
గుడ్ సమారిటన్ ప్రోత్సాహక నగదు రూ. 5 వేలు
యాక్సిడెంట్లలో గాయపడిన క్షతఘాత్రులకు గోల్డెన్ అవర్ లోపు ఆసుపత్రులలో చేర్పించి ప్రాణాలు కాపాడాలి : జిల్లా కలెక్టర్
ఆంధ్ర ప్రదేశ్/ తిరుపతి జిల్లా/ హ్యూమన్ రైట్స్ టుడే న్యూస్ ప్రతినిధి:- జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు అన్ని శాఖలు సమన్వయంతో చర్యలు చేపట్టాలని, యాక్సిడెంట్లలో గాయపడిన క్షతఘాత్రులకు గోల్డెన్ అవర్ లోపు ఆసుపత్రులలో చేర్పించి ప్రాణాలు కాపాడడం మన అందరి భాద్యత అని, కోర్టులకు తిరగాల్సిన భయం ఇప్పుడు లేదని , పైగా పురస్కారం లభిస్తుందని జాతీయ రోడ్డు భద్రత వారోత్సవాలను విజయవంతం చేయలని జిల్లా కలెక్టర్ కె.వెంకటమణారెడ్డి అన్నారు. బుధవారం స్థానిక కలెక్టరేట్ నందు వీడియో కాన్ఫరెన్స్ హాల్లో రోడ్డు భద్రత మరియు యాక్సిడెంట్ల నివారణ చర్యల పై నేషనల్ హైవే , ఆర్ అండ్ బి అధికారులు, డ్రైవర్లు, హెల్త్, పోలిస్, డి ఎల్ డి ఓ, రవాణా శాఖ అధికారులతో కలసి సమీక్ష నిర్వహించి దిశా నిర్దేశం చేసారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలను, మరణాలను తగ్గించుటకు జాతీయ రహదారి భద్రత వారోత్సవాలు నేటి నుండి ఈ నెల 24 వరకు జరగనున్న నేపథ్యంలో ప్రజలలో, డ్రైవర్ లు, వాహనదారులలో రహదారి భద్రతపై విస్తృతస్థాయి అవగాహన కార్యక్రమాలు ప్రణాలికా బద్ధంగా చేపట్టి అన్ని శాఖల సమన్వయంతో విజయవంతం చేయాలని అధికారులకు పిలుపునిచ్చారు. ఈ వారోత్సవాలు “స్వచ్ఛత పఖ్వాడ- “యువశక్తిద్వారా సామాజిక మార్పు” అనే నినాదంతో చేపడుతున్నామని అన్నారు. పుత్తూరు -నాయుడుపేట రహదారుల పనులు పురోగతిలో ఉన్నాయని, ప్రమాదకర మలుపులు వద్ద భద్రతా పరమైన సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రజలలో చాలా మందికి రహదారి నియమావళి పై అవగాహన లేకపోవడం, డ్రైవర్ల అవగాహన లోపం, బాధ్యత రాహిత్యం వలన చాలా ప్రమాదాలు జరుగుతున్నాయని, వాటిని నివారించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అభిప్రాయపడ్డారు. ద్విచక్ర వాహన ప్రయాణంలో ఇదిగా విధిగా హెల్మెట్ ధరించడం , ఫోర్ వీలర్ ప్రయాణంలో సీటు బెల్టు ధరించడం తప్పనిసరి అని నిర్లక్ష్యంగా వ్యవహరించినచో జరిమానాలు విధించాలని అన్నారు. రహదారి ప్రమాదాలలో టూ, ఫోర్ వీలర్ మరణాల సంఖ్య ఎక్కువగా ఉన్నదని నిబంధనల మేరకు కఠినంగా రోడ్డు భద్రతా నియమావళి అములు చేయాలని , రాత్రివేళ జాతీయ రాష్ట్ర రహదారులపై ఎట్టిపరిస్దిల్లో వాహనాలు నిలపరాదని ఇవి రహదారి ప్రమాదాలకు ముఖ్య కారణమవుతున్నాయని అన్నారు. తప్పనిసరిగా అన్ని వాహనాల వెనుక వైపున రేడియం స్టిక్కర్ ఏర్పాటు చేసుకునేలా సంబంధిత రవాణా శాఖ, పోలీసు అధికారులు చూడాలని ఆదేశించారు. క్షేత్ర స్థాయిలో గ్రామాల , మండలాల వారిగా సంబందిత అధికారులు సమన్వయంతో భద్రతా లోపాలు గల ప్రాంతాలను గుర్తించి వాటి నివారణకు తీసుకోవలసిన చర్యలపై ఒక సమగ్ర ప్రణాళిక అవసరమని అన్నారు. అవసరమైన మరమ్మతులు చర్యలు చేపట్టి, అధికారుల స్థాయిలో వీలుకాని వాటిపై నివేదిక ఇవ్వగలిగితే సంబందిత నేషనల్ హైవేస్, ఆర్&బి , మునిసిపల్, ఆర్ అండ్ బి , ఇంజనీరింగ్ శాఖల అధికారులతో సమీక్షించి వాటి అమలుకు సత్వర చర్యలు చేపడుతామని అన్నారు. మునిసిపల్ పంచాయతి అధికారులు రోడ్లపై ఏర్పడ్డ గుంతలను గుర్తించి ఎప్పటికప్పుడు మరమ్మతులు చేసే విధంగా ఉండాలని అవసరమున్న చోట విద్యుత్ దీపాల ఏర్పాటు చేయాలని సూచించారు.
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన గుడ్ సమారిటన్ స్కీం కింద ఎవరైనా రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి సకాలంలో గోల్డెన్ హవర్ లో ప్రాణాలు కాపాడే ప్రయత్నం చేసి ఆసుపత్రులకు తరలించిన వారికీ ప్రోత్సాహకంగా రూ.5 వేలు అందించబడుతుందని, ప్రతి పౌరుడు భాద్యతతో వ్యవహరించి ప్రమాద బాదితులకు అండగా నిలవాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. ఇలాంటి గుడ్ సమారిటన్ ల వివరాలను పోలీసులు నిర్బందించి తీసుకోవడానికి కోర్టుకు రావాలని ఇబ్బంది పెట్టడం జరగదని అన్నారు. పోలీసులు తదనుగుణంగా వ్యవహరించాలని సూచించారు. క్షతగాత్రులను చేర్చిన ఆసుపత్రులలో ప్రమాద బాదితుల వివరాలు కేంద్ర ప్రభుత్వం ఎన్.ఐ.సి వరి ఐరాడ్(IRAD) యాప్ లో నమోదు చేయడం ద్వారా జాతీయ స్థాయి వరకు ఈ వివరాలు అందుబాటులో ఖచ్చితత్వంతో ఉంటాయని సంబందిత డాక్టర్ లు దీనిపై పూర్తి అవగాహనతో ఉండాలని తెలిపారు. అంతేకాకుండా ప్రతి ఆసుపత్రిలో గుడ్ సమ్మారిటన్ పథకం గురించి అందరికీ కనపడే విధంగా వివరాలను పొందుపరచాలని అన్నారు.
గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది వాలంటిర్లు, ఎన్.జి.ఓ లు అవగాహన కలిగి ఉన్నారని వారు గుడ్ సమారటన్ గా క్షతగాత్రులకు వారి వంతు సహాయంగా ఆస్పత్రులకు తరలించే కార్యక్రమం లో పాలు పంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. గతంలో గుర్తించిన బ్లాక్ స్పాట్స్ ప్రమాదకర ప్రాంతాలతో పాటుమండలంలో యాక్సిడెంట్ లకు అవకాశమున్న ప్రాంతాలను మండల టీం గుర్తించి వాటి నివారణకు చర్యలు చేపట్టాలని సంబందిత ప్రాంతాల్లో సైన్ బోర్డ్లు ఏర్పాటు, స్పేడ్ బ్రేకర్లు, జీబ్రా లైన్ లు, లైటింగ్ తదితర అంశాలపై ప్రణాళికా బద్ధంగా చర్యలు చేపట్టాలని తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జాతీయ వారి భద్రత వారోత్సవాల మీద కరపత్రాలను విడుదల చేసారు.
ఈ కార్యక్రమంలో జిల్లా రవాణా శాఖ అధికారి సీతారాం రెడ్డి, ట్రాఫిక్ డిఎస్పి విజయ్, డి.ఎల్.డి.ఓ సుశీల దేవి, రవాణా శాఖ ఎం.వి.ఐ లు, ఎస్.హెచ్.ఓ లు, ఎన్ హెచ్ , అర్ అండ్ బి అధికారులు , తదితరులు పాల్గొన్నారు.