కేరళలో ఏఐ ‘ఐరిస్’ టీచరమ్మ..

Get real time updates directly on you device, subscribe now.

మరో చరిత్ర సృష్టించిన కేరళ.
హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/మార్చ్ 08:
దేశంలోనే తొలిసారి (తిరువనంతపురం) స్కూల్లో విద్యార్థులకు పాఠాలు చెబుతున్న ఏఐ టీచ‌ర్ (AI Teacher) రోబో.

కేరళలో ఏఐ ‘ఐరిస్’ టీచరమ్మ.. విద్యార్థులకు భలేగా పాఠాలు చెబుతుందిగా..!

Kerala AI Teacher Robot : భారత మొట్టమొదటి ఏఐ ఐరిస్ టీచర్ వచ్చేసింది. దేశంలోనే తొలిసారిగా ఏఐ టీచర్‌తో పాఠాలు చెప్పించి కేరళ చరిత్ర సృష్టించింది.

ఈ ఏఐ టీచర్ సంక్లిష్టమైన ప్రశ్నలకు కూడా సమాధానం ఇవ్వగలదు. రానున్న రోజుల్లో మనుషులతో పనిలేదా? ఏఐ రోబోలే అన్ని పనులు చేసేలా కనిపిస్తున్నాయి. ప్రతి కంపెనీ ఏఐ టెక్నాలజీపైనే ఎక్కువగా దృష్టి పెడుతున్నాయి. ఇప్పుడు స్కూళ్లలో కూడా ఏఐ టెక్ ఆధారిత హ్యుమన్ రోబోలు వచ్చేస్తున్నాయి. స్కూళ్లలో విద్యార్థులకు నాణ్యమైన విద్యను బోధించేందుకు ఏఐ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు.                               తాజాగా కేరళలోని ఓ స్కూళ్లో ఏఐ టీచర్ ప్రత్యక్షమైంది. తిరువనంతపురంలోని స్కూల్లో ఏఐ టీచర్‌ను తీసుకొచ్చింది. దేశంలోనే మొట్టమొదటి మానవరూప రోబో ఉపాధ్యాయురాలిని ప్రవేశపెట్టిన రాష్ట్రంగా కేరళ చరిత్ర సృష్టించింది. అయితే, మేకర్ ల్యాబ్స్ ఎడ్యుటెక్ సహాకారంతో ఈ కొత్త ఏఐ టీచర్‌ను డెవలప్ చేశారు. దీనికి ‘ఐరిస్’ అని కూడా పేరు పెట్టారు.

అచ్చం మనుషుల్లానే ఈ మానవ రోబో విద్యార్థులకు పాఠాలు చెప్పేస్తోంది. విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు కూడా సమాధానాలు చెప్పేస్తోంది. ఈ ఐరిస్ టీచర్ స్కూళ్లలో పాఠ్యేతర కార్యకలాపాలను అందించనుంది. 2021 నీతి ఆయోగ్ చొరవతో అటల్ టింకరింగ్ ల్యాబ్ (ATL) ప్రాజెక్టులో భాగంగా కడువాయిల్ తంగల్ ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా కేటీసీటీ హయ్యర్ సెకండరీ స్కూల్లో ఏఐ టీచర్‌ను ప్రవేశపెట్టారు.

3 భాషల్లో మాట్లాడగలదు :
కొచ్చికి చెందిన మేకర్ ల్యాబ్స్.. ఏఐ టీచర్ ఎలా పాఠాలను బోధిస్తుందో పరీక్షించింది. కట్టుబొట్టు, చీరకట్టులో ఈ ఏఐ టీచరమ్మ విద్యార్థులకు పాఠాలు బోధించడమే కాదు..  పాఠ్యాంశాలకు సంబంధించి అడిగిన సందేహాలకు కూడా సమాధానాలను ఇస్తోంది. మొత్తం మూడు భాషలను అనర్గళంగా మాట్లాడగలదు.

ఈ మానవరూప రోబోలో ప్రత్యేకించి ఆటోమేటెడ్ టీచింగ్ టూల్స్ కన్నా అత్యంత అడ్వాన్సడ్ టెక్నాలజీని ఉపయోగించారు. చూసేందుకు ఐరిస్ టీచరమ్మ లేడీ వాయిస్‌లోనే మాట్లాడుతోంది. స్కూళ్లలో టీచర్స్ ఎలా విద్యార్థులకు పాఠాలను బోధిస్తారో అలానే చెబుతూ అందరిని ఆశ్చర్యపరుస్తోంది. విద్యార్థులు ఎలాంటి ప్రశ్నలు అడిగినా వాటికి వెంటనే సమాధానాలిస్తోంది. వివరణ కూడా ఇస్తోంది. విద్యార్థులకు షేక్ హ్యాండ్ కూడా ఇస్తోంది. ఈ ఐరిస్ టీచర్ రోబో నడిచేందుకు కాళ్ల కిందిభాగంలో చక్రాలను కూడా అమర్చారు. విద్యార్థుల వద్దకు నేరుగా వెళ్లి వారితో మాట్లాడగలదు. ఈ ఏఐ టీచర్ రాకతో కేరళ విద్యారంగంలో గణనీయమైన మార్పును సూచిస్తుంది. ఐరిస్‌కు పాఠాలను విద్యార్థులకు అర్థమయ్యేలా చెప్పడంలో శిక్షణ పొందింది. ఈ ఐరిస్ టీచరమ్మ పాఠాలు చెబుతున్న వీడియోను మేకర్ ల్యాబ్స్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయడంలో వైరల్ అవుతోంది.

Get real time updates directly on you device, subscribe now.

Leave a comment