హ్యూమన్ రైట్స్ టుడే/ఖమ్మం/18 జనవరి 2023: భారాసా ఆవిర్భావం తర్వాత తొలిసారిగా నిర్వహించిన సభకు ఆ పార్టీ కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. సీఎం కేసీఆర్‌తో పాటు దిల్లీ సీఎం కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ తదితరులు హాజరుకావడంతో గులాబీ శ్రేణుల్లో మరింత జోష్ పెరిగింది. ఏపీ, తెలంగాణలోని వివిధ జిల్లాల నుంచి కార్యకర్తలు భారీగా తరలిరావడంతో ఖమ్మం పట్టణం జనసంద్రంగా మారింది.
కేంద్రం వైఖరితో రాజ్యాంగం సంక్షోభాన్ని ఎదుర్కోంటోంది: విజయన్
ఈ సందర్భంగా కేరళ సీఎం పినరయి విజయన్ మాట్లాడుతూ.. ‘‘ తెలంగాణ పోరాటాల పురిటిగడ్డ. తెలంగాణ సాయుధ పోరాటం భూ సంస్కరణలకు కారణమైంది. ప్రజల సంక్షేమం కోసం తెలంగాణ అనేక చర్యలు చేపడుతోంది. స్వాతంత్య్ర సమరంలో పాల్గొనని శక్తులు కేంద్రంలో అధికారంలో ఉన్నాయి. ఏ భాషకు ఆ భాష ప్రత్యేకమైంది. కేంద్రం వైఖరితో లౌకికతత్వం ప్రమాదంలో పడుతోంది. కేంద్రంపై పోరాడేందుకు కేసీఆర్ నడుం బిగించారు. కార్పొరేట్ శక్తులకే కేంద్రం ఊతమిస్తోంది. ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలను అనైతిక పద్ధతుల్లో కూలదోస్తోంది. కేంద్ర వైఖరితో రాజ్యాంగం సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది’’ అని విజయన్ ఆరోపించారు.
వచ్చే ఎన్నికల్లో భాజపా గద్దె దిగడం ఖాయం: అఖిలేష్
యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ మాట్లాడుతూ… ‘‘ప్రశ్నించిన నేతలను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో భాజపా ప్రభుత్వం గద్దె దిగడం ఖాయం. ఎన్నికైన ప్రభుత్వాలను భాజపా ఇబ్బందులకు గురి చేస్తోంది. దేశంలో నిరుద్యోగం బాగా పెరిగింది. రైతులకు సరైన మద్ధతు ధర లభించట్లేదు. రెండేళ్లలో రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్న హామీ ఏమైంది. గంగా ప్రక్షాళన చేస్తామని నమ్మక ద్రోహం చేశారు. తెలంగాణలో ఇంటింటా తాగునీరు, ప్రతి ఎకరాకు సాగునీరు అందుతోంది. భాజపాను గద్దె దించేందుకు కలిసి పనిచేస్తాం. ఖమ్మం సభ నుంచి దేశానికి మంచి సందేశం ఇస్తున్నారు’’ అని అఖిలేష్ యాదవ్ అన్నారు.