ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్టు కానున్నాడా?
హ్యూమన్ రైట్స్ టుడే/న్యూ ఢిల్లీ /జనవరి 04:
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటోన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ అధికారులు నేడు అరెస్ట్ చేయవచ్చని ఆప్ ఆరోపించింది.
కేజ్రీవాల్ నివాసంలో ఈడీ సోదాలు జరుపుతారనే సమాచారం తమకుందని ఆప్ నేతలు చెబుతున్నారు. లోక్‌సభ ఎన్నికల ముందే సమన్లు ఎందుకు పంపుతున్నారని ఆప్ నేతలు సోషల్ మీడియా ద్వారా ప్రశ్నించారు.
కేజ్రీవాల్ అరెస్ట్‌కు కుట్రలు జరుగుతున్నాయని, రెండు వారాల్లో మూడు సార్లు సమన్లు ఇచ్చారంటూ ఆప్ నేతలు పేర్కొన్నారు. ఈడీ ప్రతీ ప్రశ్నకు కేజ్రీవాల్ సమాధానం చెబుతారంటూ పేర్కొన్నారు.
అయితే, కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేస్తారంటూ ఆప్ నేతలు చేస్తున్న ఆరోపణలను ఈడీ వర్గాలు తోసిపుచ్చాయి. కేజ్రీవాల్ నివాసంలో సోదాలు ఉండవని, అరెస్ట్ అనేది ప్రచారం మాత్రమే నని స్పష్టం చేశాయి.
అంతకుముందు మద్యం కుంభకోణం కేసులో కేజ్రీవాల్ ఈడీ విచారణకు మూడోసారి గైర్హాజర య్యారు. మూడోసారి సమన్లకు రిప్లై ఇస్తూ ఆయన రాజ్యసభ ఎన్నికలు, రిపబ్లిక్ డే ఉత్సవాల పనుల్లో తలమునకలై ఉండటం వల్ల విచారణకు హాజరుకా లేనంటూ ఈడీకి లేఖ పంపారు.
ఈడీ పంపే ఏ ప్రశ్నలకైనా తాను జవాబులివ్వడానికి సిద్ధంగా ఉన్నానంటూనే తనను విచారించేందుకు గల నిజమైన ఉద్దేశాన్ని తెలపాలని ఆయన కోరారు. మూడోసారి కూడా ఈడీ విచారణకు డుమ్మా కొట్టడంతో కేజ్రీవాల్ అరెస్ట్ ఖాయమనే ప్రచారం జరుగుతోంది.
కేజ్రీవాల్‌కు మొదటగా గతేడాది నవంబర్ 2న, ఆ తర్వాత డిసెంబర్ 21న, ఈ ఏడాది జనవరి 3న విచారణకు హాజరు కావాలని ఈడీ నోటీసులు పంపింది. కానీ అన్ని నోటీసులను కేజ్రీవాల్ దాటవేశారు.