ముఖ్యమంత్రి పదవిలో రేవంత్ రెడ్డి పులిమీద స్వారీ

Get real time updates directly on you device, subscribe now.

సీఎం రేవంత్ రెడ్డికి ఓ లెక్కుంది!

హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/జనవరి 02:
ఓ వైపు అప్పులు, మరోవైపు సంక్షేమం రూపంలో భారీ వ్యయాలు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ముందున్న అతిపెద్ద సవాళ్లు ఇవే. కాంగ్రెస్ సర్కార్ ఇప్పుడా సవాళ్లను అధిగమించి ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సి ఉంటుంది.

అభివృద్ధిని పరుగులు పెట్టించాల్సి ఉంటుంది. ప్రస్తుతం తెలంగాణ ముఖ్యమంత్రి పదవిలో రేవంత్ రెడ్డి ఇప్పుడు పులిమీద స్వారీ చేస్తున్నారు. అయితే ఆయనకు అనేక అవకాశాలు దారులు చూపుతున్నాయి.

దేశంలో 29వ రాష్ట్రంగా ఆవిర్భవించి 10 ఏళ్ల ప్రస్థానంలో తెలంగాణ రాష్ట్రం దేశం దృష్టిని ఆకర్షించిందని చెప్పేందుకు ఎలాంటి సందేహం అవసరం లేదు. అదే సమయంలో భారీగా పెరిగిన అప్పులు భవిష్యత్తుకు సవాళ్లు విసురుతున్నాయి.

అధికార, ప్రతిపక్ష పార్టీలు విడుదల చేసిన శ్వేత, స్వేద పత్రాలతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రజల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది. ఎన్నికల హామీలను ఆచరణలో పెడితే ప్రజలు కోరుకున్న మార్పు, అందరూ ఆకాంక్షిస్తున్న అభివృద్ధి సాధ్యమవుతుంది.

ఆ దేశాలే స్ఫూర్తి…
తెలంగాణ రాష్ట్రంలో వనరులకి కొదవలేదు. పురోగతిలో ప్రపంచం దృష్టిని ఆకర్షించేందుకు అనేక అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు కావాల్సిందల్లా స్పష్టమైన, ఆచరణీయమైన విధానాలు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పలు రాష్ట్రాలు, దేశాలు ఇలాంటి సవాళ్లనే ఎదుర్కొని ఎదురీది నేడు ప్రపంచం ముంగిట సగౌరవంగా నిల్చున్నాయి.

ప్రభుత్వం, ప్రజల మధ్య అనుసంధానానికి టెక్నాలజీనే వేదికగా చేసుకొని ఇతర దేశాలకు మోడల్‌గా గుర్తింపు పొందింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం దక్షిణ కొరియా, సింగపూర్, ఎస్తోనియా అమలు చేస్తున్న విధానాలను అధ్యయనం చేసి ఇక్కడా ఆచరిస్తే మెరుగైన ఫలితాలు సాధించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

*ఉద్యోగాలు.. ఉపాధి చూపాలి*

నీళ్లు.. నిధులు.. నియామకాల నినాదంలో బీఆర్ఎస్ సర్కార్ చేసిన తప్పిదాలు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం పునరావృతం చేయకూడదు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపు 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న కాంగ్రెస్ హామీపై నిలబెట్టుకోవాలి. యువత దీనిపై భారీ ఆశలు పెట్టుకుంది.

టీఎస్పీఎస్సీ తీరుతో విసిగిపోయిన ఉద్యోగార్థులు ఈ అంశంలో కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలను నిశితంగా గమనిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో జాబ్ క్యాలెండర్, పరీక్షల నిర్వహణలో ఎలాంటి లోపాలకు తావు లేకుండా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. డిగ్రీలు, పీజీలు చేసిన ప్రతి ఒక్కరికీ సర్కారీ ఉద్యోగాలు ఇవ్వడం ఏ ప్రభుత్వం వల్ల కూడా సాధ్యం కాదన్నది ఎవరూ కాదనలేని సత్యం. ఈ విషయంలో ప్రత్యామ్నాయంగా ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోవాలి.

వ్యవసాయంలో సమృద్ధి దిశలో పయనిస్తోన్న మన రాష్ట్రంలో ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో అద్భుతాలు సృష్టించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఐటీ, తయారీ, సేవల రంగాల్లో విస్తృత అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. సంస్థలు కోరుకుంటున్నట్లుగా విద్యార్థులను తీర్చిదిద్దితే నిరుద్యోగిత అనే సవాల్‌ని సులువుగా అధిగమించవచ్చు.

*పాలన వికేంద్రీకరణ జరగాలి*

పురోగతి మొత్తం ఒకే దగ్గర కేంద్రీకృతమైతే ప్రజల సామాజిక-ఆర్థిక అంశాల్లో తేడాలు ఉత్పన్నం అవుతాయి. రాష్ట్రంలో ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ మొత్తం తీర్పు ఒకలా ఉంటే హైదరాబాద్, దాని చుట్టుపక్కల ప్రాంతాల తీర్పు మరోలా ఉంది. అందుకే రేవంత్ సారథ్యంలోని కాంగ్రెస్ సర్కార్ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను సమాన స్థాయిలో అభివృద్ధి చేయడంపై దృష్టి సారించాలి.

ఐటీ, ఫుడ్ ప్రాసెసింగ్, తయారీ, సేవల రంగాలను జిల్లా కేంద్రాలకు విస్తరించాలి. పరిశ్రమలను వికేంద్రీకరించాలి. ఉద్యోగాల కోసం ప్రతి ఒక్కరు హైదరాబాద్‌కు రానవసరం లేకుండా వారి ప్రాంతాల్లోనే మంచి అవకాశాలు దక్కేలా వ్యవస్థలను స్థాపించాలి.

విద్య, వైద్యంపై చేసే వ్యయాన్ని ఖర్చుగా చూడొద్దు. ఈ రంగాల్లో పెట్టే ప్రతి రూపాయి ప్రతిఫలంగా రెండు, మూడు రెట్ల ఆర్థిక ప్రగతి సాధించి పెడుతుంది. ప్రభుత్వ విద్య, వైద్యాన్ని ఎంత బలోపేతం చేస్తే రాష్ట్రం అంత ప్రగతి సాధిస్తుంది. నగదు పంపిణీ పథకాల కన్నా ప్రభుత్వ విద్య, వైద్యం, రవాణా సదుపాయాలను మెరుగ్గా అందిస్తే చాలనే వాదన ఇటీవల కాలంలో బలంగా వినిపిస్తోంది.

ఓ వైపు ఇచ్చిన హామీలు, మరోవైపు అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగించడం, కొత్త ఆలోచనలను ఆచరణలో పెట్టడం రేవంత్ సర్కార్‌కి కత్తిమీద సాము లాంటిదే. రూ. 2 లక్షల రుణమాఫీ, మహిళలకు నెలకి రూ. 2500, రూ. 4వేల చేయూత పింఛన్లు, రైతు భరోసా కింద రూ. 15 వేలు, కౌలు రైతులకి రూ. 12 వేలు, రూ. 500 గ్యాస్ సిలిండర్ వంటి పథకాల అమలుకే అధిక మొత్తంలో నిధులు అవసరం అవుతాయి. అయితే రాష్ట్ర ఆదాయం పెంచి, సంక్షేమ పథకాలు అమలు చేస్తామని కాంగ్రెస్ చెబుతోంది. వ్యవసాయం, ఉత్పత్తి, సేవల రంగాలని బలోపేతం చేసి ఎగుమతులు పెంచుకోవాలి. తద్వారా రాష్ట్ర రాబడి పెరుగుతుంది.

*పాలకుడిగా.. నాయకుడిగా*

దేశంలో పలు రాష్ట్రాల్లో గతంలో చోటుచేసుకున్న పరిణామాల దృష్ట్యా కాంగ్రెస్ సర్కార్ వచ్చే 5 ఏళ్లు ఐక్యంగా ఉండి, సమష్టిగా పనిచేస్తుందనే నమ్మకాన్ని రాష్ట్ర ప్రజల్లో కల్పించాల్సిన బాధ్యత నాయకుడిగా రేవంత్ భుజాలపైనే ఉంది.

Get real time updates directly on you device, subscribe now.

Leave a comment