ISRO: కొత్త ఏడాది తొలిరోజే ప్రయోగం.. పీఎస్‌ఎల్‌వీ-సీ58 కౌంట్‌డౌన్ షురూ
హ్యూమన్ రైట్స్ టుడే/శ్రీహరికోట/డిసెంబర్ 31: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) 2024 కొత్త ఏడాది తొలి రోజే పీఎస్‌ఎల్‌వీ-సి58 ప్రయోగం చేపట్టేందుకు సన్నాహాలు చేసింది. పీఎస్‌ఎల్‌వీ వాహకనౌక మనదేశానికి చెందిన ఎక్స్-రే పొలారిమీటర్ ఉపగ్రహం(ఎక్స్‌పోశాట్)ను అంతరిక్షంలోకి మోసుకెళ్లనుంది.
ఇందుకు సంబంధించి సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ షార్ (శ్రీహరికోట)లో కౌంట్‌డౌన్ ప్రక్రియ ఆదివారం ఉదయం 8.10 గంటలకు ప్రారంభమైంది. ఈ ప్రక్రియ 25 గంటలపాటు కొనసాగి సోమవారం ఉదయం 9.10 గంటలకు పీఎస్‌ఎల్‌వీ-సి58 వాహకనౌక షార్‌లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి నింగిలోకి దూసుకెళ్లనుంది. ఇది ఎక్స్‌పోశాట్‌ను కక్ష్యలోకి వదిలిపెట్టిన తర్వాత పీఎస్4 10 ఇతర పేలోడ్‌లను హోస్ట్ చేయనుంది.
ఎక్స్‌పోశాట్ భారతదేశం అంతరిక్ష ఆధారిత ఎక్స్-రే ఖగోళ శాస్త్రంలో సంచలనాత్మక పురోగతికి నాంది కానుంది. ఇమేజింగ్, టైం-డొమైన్ అధ్యయనాలు, స్పెక్ట్రోస్కొపీపై ప్రధానంగా దృష్టి సారించిన మునుపటి మిషన్ల మాదిరిగా కాకుండా.. ఎక్స్-రే ఖగోళ శాస్త్రానికి ఒక కొత్త కోణాన్ని పరిచయం చేస్తూ, ఎక్స్-రే మూలాలను అన్వేషించడం ఎక్స్‌పోశాట్ లక్ష్యం. ఈ ఉపగ్రహ జీవితకాలం అయిదేళ్లు. పీఎస్‌ఎల్‌వీ చివరి దశ మరో పది పరికరాలను అంతరిక్షానికి మోసుకెళ్లనుంది. దీనికి పీఎస్‌ఎల్‌వీ ఆర్బిటల్ ఎక్స్‌పెరిమెంటల్ మాడ్యూల్(పీవోఈఎం) అని నామకరణం చేశారు.