ఉద్యమకారుల జాబితాలో.. ఉన్నట్టా.. లేనట్టా..?

Get real time updates directly on you device, subscribe now.

*ఉద్యమకారుల జాబితాలో.. ఉన్నట్టా.. లేనట్టా..?*

*జర్నలిస్టుల అక్షర పోరాటంతోనే ఉద్యమం ఉధృతం..*

*ఢిల్లీ తాకేలా ఉద్యమానికి షాద్ నగర్ లో ఊపు తెచ్చిన జర్నలిజం..*

*పాత్రికేయులను గుర్తించని పాత సర్కారు..!*

*కొత్తప్రభుత్వమైనా గుర్తింపుని ఇస్తుందా..?*
హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/డిసెంబర్ 28:
ఒకనాడు స్వాతంత్ర ఉద్యమాన్ని ప్రపంచానికి చాటింది అక్షరం.. తరువాత నిజం నిరంకుశత్వాన్ని వెలుగులోకి తెచ్చింది అక్షరం.. తెలంగాణ తొలి దశ ఉద్యమానికి ఊపిరి పోసింది అక్షరం.. 2001 నుంచి 2014న సహకారమైన తెలంగాణ ఉద్యమాన్ని నడిపించింది అక్షరం.. ఆ అక్షరానికి ఆయువుపట్టుగా నిలిచింది విలేకరులు.. కానీ తెలంగాణ వచ్చాక వారికి ఏనాడు గుర్తింపు లేదు.. పైపెచ్చు తిట్లు శాపనార్థాలే బహుమతిగా అంది వచ్చాయి. తెలంగాణ వస్తే తమ బతుకులు బాగుపడతాయని ఆశించిన పాత్రికేయులకు నిరాశే మిగిలింది. మరి కొత్త ప్రభుత్వమైన పాత్రికేయులను గుర్తిస్తుందా.. తెలంగాణ పోరాట యోధులలో ఒకరిగా అక్కున చేర్చుకుంటుందా..

*మేము సైతం..*

2001లో తెలంగాణ ఉద్యమం ప్రారంభమైనప్పటి నుంచి తెలంగాణ అవసరాన్ని, ఆంధ్ర పాలకుల అన్యాయాలను వెలుగులోకి తెస్తూ పత్రికలు చేసిన కృషి పాఠకులు ఎప్పటికీ మర్చిపోరు. మరోవైపు తెలంగాణ కోసం పార్టీలు చేసిన ఉద్యమాలను కూడా ప్రాధాన్యతతో ప్రజల ముందు ఉంచి తెలంగాణ ఆవశ్యకతను చాటింది కూడా పత్రికలే. అంతేకాదు.. పాత్రికేయ సంఘాలు స్వయంగా రంగంలోకి దిగి సకలజన సమ్మెలో పాలుపంచుకొని ఉద్యమానికి అండగా నిలిచారు. తెలంగాణ కోసం ఒకవైపు అక్షర యుద్ధం చేస్తూనే మరోవైపు ప్రత్యక్ష యుద్ధంలో కూడా పాలుపంచుకున్నారు. 2014లో తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించేదాకా పాత్రికేయుల పోరు సాగింది. ఆ తర్వాత తెలంగాణ అభివృద్ధిలోనూ సలహాలు సూచనల ద్వారా పాత్రికేయులు కృషి చేశారు. సామాన్యుల సమస్యలను ఎప్పటికప్పుడు వెలుగులోకి తెచ్చి వాటిని పరిష్కరించేలా ప్రయత్నించారు. కానీ చివరికి మిగిలిందేమిటి..?

*క్షణక్షణం భయం భయం..*

తెలంగాణ ఆవిర్భవించాక పాత్రికేయులు తమ స్వేచ్ఛను కోల్పోయారు. క్షణక్షణం భయం భయంగా బ్రతుకులను సాగించారు. సమస్యలు అవినీతి వంటివి వెలుగులోకి తెస్తే అక్రమంగా కేసులు చేసి పోలీస్ స్టేషన్లో పడేసిన ఘటనలు ఎన్నో జరిగాయి. మరోవైపు కొందరు నాయకులు పాత్రికేయుల పట్ల బెదిరింపులకు కూడా పాల్పడ్డారు. పదేళ్లపాటు ఇలాంటి గడ్డు పరిస్థితులు ఎన్నో పాత్రికేయులు ఎదుర్కోవాల్సి వచ్చింది. మరోవైపు కోవిడ్ తర్వాత పాత్రికేయుల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. షాద్ నగర్ లో కోవిద్ బారిన పడి ఓ యువ జర్నలిస్టు మృతి చెందిన విషయం తెలిసిందే.

*కొత్త సర్కారు ..కొత్త ఆశలు..*

ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. నిజాయితీగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ గత పాలనలో షాద్ నగర్ లో పాత్రికేయులకు పూర్తిస్థాయిలో స్వేచ్ఛ ఉండేది. మరి కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పాత్రికేయులకు పూర్తిస్థాయిలో స్వేచ్ఛను ఇస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. దీనితోపాటు తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన పాత్రికేయులకు తగిన గుర్తింపు ఇవ్వాలని పాత్రికేయులు ముక్తకంఠంతో కోరుతున్నారు. పాత్రికేయులు దశాబ్ద కాలంగా ప్లాట్లు, ఇండ్లు వంటివి ఆశిస్తూ ప్రభుత్వ కరుణ కోసం ఎదురుచూస్తున్నారు. మరి కొత్త ప్రభుత్వమైన పాత్రికేయులను ఉద్యమకారులుగా గుర్తించి ఇళ్ల స్థలాలు ఇస్తుందా, ఇంటి నిర్మాణాలకు సహకరిస్తుందా.. అన్నది వేచి చూడాలి.

Get real time updates directly on you device, subscribe now.

Leave a comment