హలో పవన్ కల్యాణ్ గారూ అంటూ…
హ్యూమన్ రైట్స్ టుడే/హైదరబాద్/17 జనవరి 2023: ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ జనసేనాని పవన్ కల్యాణ్, మెగా బ్రదర్ నాగబాబులపై మళ్లీ సెటైర్లు వేశారు. తన అధికారిక ట్విట్టర్ లో ఓ వీడియోను విడుదల చేసిన ఆయన కొణిదెల నాగబాబు గారూ.. అంటూ ఆయనపై మాటల తూటాలు సంధించారు. ఆయన అన్నయ్య చిరంజీవి, తమ్ముడు పవన్ కల్యాణ్ కు నాగబాబు ప్రియమైన వ్యక్తి కావొచ్చేమో గానీ తనకు కాదన్నారు. తాను జనసేన పార్టీ మీద కానీ, పవన్ కల్యాణ్ మీద గానీ పెట్టిన ట్వీట్లు ఓ అభిమానిగా చేసినవేనన్నారు. అయితే వారికి అర్థం కాకపోవడం తన దురదృష్టమని, తన కంటే ఎక్కువ పవన్ కల్యాణ్ దురదృష్టకరమని రామ్ గోపాల్ వర్మ వ్యాఖ్యానించారు. నాగబాబు లాంటి సలహదారులను మాత్రమే పెట్టుకుంటే దాని ఫలితాన్ని ప్రజలే చెబుతారని పేర్కొన్నారు. ‘హలో పవన్ కల్యాణ్ గారూ.. మీ భాయిజాన్ గారిని చూసుకోండి’ అని తన వీడియోకు క్యాప్షన్ ఇచ్చారు. కాగా గత కొన్ని రోజులుగా అటు టీడీపీ అధినేత చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లపై తనదైన శైలిలో విమర్శలు గుప్పిస్తున్నారు వర్మ. ఇక యువశక్తి సభలో పవన్ ప్రసంగంపై కూడా సెటైర్లు వేశారు.
కాగా సంక్రాంతి సందర్భంగా రామ్ గోపాల్ వర్మ గోదావరి జిల్లాల్లో పర్యటించారు. ఆదివారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కాకినాడ శాసన సభ్యుడు ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డిని కలుసుకుని రాజకీయ వ్యవహారాలపై చర్చించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ గోదావరి జిల్లాల్లో తనకు చాలామంది స్నేహితులు ఉన్నారని, సంక్రాంతి సందర్భంగా వారు తనను పిలిస్తే ఇక్కడికి వచ్చానన్నారు. ఈ సందర్భంగానే నాగబాబు వ్యాఖ్యలపై స్పందించాలని కోరగా.. తన గురించి నాగబాబు ఏం మట్లాడారో తెలియదని, దాని గురించి తాను వినలేదని చెప్పారు. వాటిని విన్న తరువాత స్పందిస్తానని చెప్పుకొచ్చారు. ఇందులో భాగంగానే తాజాగా ఓ వీడియోను విడుదల చేశారు వర్మ.