ధరణి రిపేరు షురూ!

Get real time updates directly on you device, subscribe now.

*ధరణి రిపేరు షురూ!*

*సమస్యల శాశ్వత పరిష్కారంపై సర్కారు ఫోకస్‌..*

*సమాచార సేకరణలో రెవెన్యూ యంత్రాంగం*

*పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులు 2.31 లక్షలు*

*డిజిటల్‌ సంతకం కోసం 1.8 లక్షల ఎకరాలు*

*130 రకాలకుపైగా రెవెన్యూ సమస్యలు*

*పాస్‌బుక్‌ల కోసం యాజమానుల నిరీక్షణ*

హ్యూమన్ రైట్స్ టుడే/హైదరబాద్/డిసెంబర్ 18: ధరణి పోర్టల్‌తో ఎదురవుతున్న సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ధరణి వ్యవస్థలోని లోటుపాట్లను సవరిస్తూ, భూ సమస్యలకు తక్షణ, శాశ్వత పరిష్కారం కల్పించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిర్ణయించారు. ఇందుకోసం ధరణిపై సమగ్ర నివేదిక అందజేయాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. ఈ మేరకు రెవెన్యూ యంత్రాంగం జిల్లాల వారీగా పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుల వివరాలను సేకరిస్తోంది. ధరణి కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది రైతులు, భూ యజమానులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తామని కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల ప్రచారంలో ఎజెండాలో చేర్చింది. ఆ పార్టీ అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ధరణి సమస్యలపై దృష్టి సారించారు. ఇటీవలే ఈ అంశంపై రెవెన్యూ శాఖ, ఇతర శాఖల మంత్రులు, రెవెన్యూశాఖ ఉన్నతాధికారులు, రెవెన్యూ అంశాలలో ప్రావీణ్యం ఉన్న విశ్లేషకులతో సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ధరణి అమలవుతున్న తీరు, విధి విధానాలను ఉన్నతాధికారులు వివరించగా.. రైతులు, భూ యజమానులు ఎదుర్కొంటున్న సమస్యలను రెవెన్యూ విశ్లేషకులు తెలియజేశారు. దీంతో దరణిపై సమగ్ర నివేదిక అందజేయాలని ఉన్నతాధికారులను సీఎం ఆదేశించారు. ఈ మేరకు ఏ మాడ్యూల్‌లో ఎన్ని దరఖాస్తులు వచ్చాయంటూ రెవెన్యూ యంత్రాంగం ఆరా తీస్తోంది. కోర్టు పరిధిలో ఉన్న భూములు, పీవోబీ జాబితాలో ఉన్న భూముల వివరాలను గ్రామం, మండలాల వారీగా సేకరిస్తున్నారు. స్లాట్‌ బుక్‌ చేసుకొని ఫీజులు చెల్లించి రిజిస్ట్రేషన్‌ రద్దు చేసుకున్న వారు ఎంతమంది? వారిలో ఎంత మందికి డబ్బులు తిరిగి చెల్లించారు? ఎంత మందివి ఇంకా పెండింగ్‌లో ఉన్నాయి? వంటి అంశాలతో జాబితాను సిద్ధం చేస్తున్నారు. ధరణికి ముందు, ధరణి తరువాత ఉన్న అసైన్డ్‌ భూమి, భూదాన్‌, ఎండోమెంట్‌, వక్ఫ్‌ భూమలు, పీవోబీ, ఎవాక్యూ ప్రాపర్టీ భూములను గుర్తిస్తున్నారు. ప్రభుత్వ భూములు, వ్యవసాయ, వ్యవసాయేతర భూముల వివరాలను సేకరించే పనిలో పడ్డారు. ఇప్పటివరకు ఎన్ని దరఖాస్తులు పరిష్కరించారన్నది కూడా సేకరిస్తున్నారు.

పెండింగ్‌ దరఖాస్తులు 2.31 లక్షలు

రెవెన్యూ అధికారుల లెక్కల ప్రకారం ధరణి పోర్టల్‌లో పస్తుతం 1 నుంచి 33 వరకు టెక్నికల్‌ మాడ్యూల్స్‌ (టీఎం) ఉన్నాయి. ఈ మాడ్యూళ్లలో పరిష్కారం కోసం చేసుకున్న 2.31 లక్షల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. మరో 1.8 లక్షల ఎకరాల భూములకు సంబంధించి డిజిటల్‌ సంతకాల (డీఎస్‌) కోసం భూ యాజమానులు ఎదురు చూస్తున్నారు. ధరణి పోర్టల్‌ అమల్లోకి రాకముందు 75 రకాల భూ సమస్యలు ఉంటే, ధరణి వచ్చాక ఆ సమస్యల సంఖ్య 130కి పెరిగిందని భూ సమస్యల పరిశీలకులు పేర్కొంటున్నారు. ఇవే కాకుండా సాదా బైనామా కోసం 9.5 లక్షల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. వీటిని పరిష్కరించేందుకు ధరణి పోర్టల్‌లో ప్రస్తుతం అవకాశం లేదు. అమల్లోకి తెచ్చిన ఆర్వోఆర్‌-2020 చట్టంలో చిన్నపాటి సవరణ చేస్తే సాదాబైనామా కోసం నిరీక్షిస్తున్న లక్షలాది మంది బాధితుల దరఖాస్తులకు విముక్తి కలుగుతుందని భూ చట్టాల విశ్లేకులు, న్యాయవాది సునీల్‌కుమార్‌ తెలిపారు. ప్రస్తుతం ధరణి ఆన్‌లైన్‌లో నమోదైన భూముల వివరాలు, యాజమానుల పేర్లు, ప్రభుత్వ, ప్రైవేట్‌ సంస్థలకు సంబంధించిన సమాచారానికి పూర్తి స్థాయి బాధ్యులు ఎవరు అన్న ప్రశ్న తలెత్తుతోంది. వీటికి సంబంధించిన మాన్యువల్‌ రికార్డులు లేకపోవడంతో ఎప్పుడైనా ఈ సమస్యలు రావచ్చని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఒకరి భూమి మరో వ్యక్తిపై నమోదై పట్టాదారు పాస్‌ పుస్తకం పొందితే.. ఆ పాస్‌పుస్తకాన్ని రద్దు చేసే అధికారం ఏ అధికారికీ లేదు. బాధితుడు కేవలం కోర్టుకెళ్లి తేల్చుకోవాల్సి ఉంటుంది. కాగా, పీవోబీ జాబితాలో నమోదైన పట్టా భూములను అందులో నుంచి తొలగించేందుకూ బాధితులు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

చిన్న సమస్య పరిష్కారానికి సీసీఎల్‌ఏ వద్దకు..!

ప్రస్తుతం సర్వే నంబరు మిస్సింగ్‌, ఎక్స్‌టెన్షన్‌ కరెక్షన్‌ చేయాలంటే ఆ ఫైలు సీసీఎల్‌ఏ వరకు వెళ్లాల్సి వస్తోంది. డిజిటల్‌ పాస్‌బుక్‌ మొదటి పేజీలో తప్పులు సరిచేయించుకోవాలంటే కలెక్టర్‌ను ఆశ్రయించాలి. ఇలాంటి చిన్న చిన్న పొరపాట్లను సరిచేయించుకునేందుకు యజమానులు నెలల తరబడి అధికారుల చుట్టూ తిరగాల్సి వస్తోంది. అంతేకాకుండా ప్రతి సమస్య పరిష్కారానికీ దరఖాస్తు చేసేటప్పుడు చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. రెవెన్యూ రికార్డులను కంప్యూటర్‌లో అప్‌డేట్‌ చేసేటప్పుడు ప్రభుత్వం (అధికారులు) చేసిన తప్పులను వారే సరిదిద్దాలి. అలాంటిది తామెందుకు రుసుము చెల్లించాలని యజమానులు ప్రశ్నిస్తున్నారు. ఉన్న ఇబ్బందులకు తోడు ఈ ఫీజులతో తమపై ఆర్థిక భారం పడుతోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ధరణి రావడానికి ముందే కొందరు రైతులు, భూ యజమానులు సమస్యలు ఎదుర్కొంటుండగా.. ధరణి అమల్లోకి వచ్చాక కొత్త వారు జత అయ్యారు. దీంతో ధరణి బాధితుల సంఖ్య రాష్ట్ర వ్యాప్తంగా రోజురోజుకూ పెరుగుతూ వచ్చింది.

Get real time updates directly on you device, subscribe now.

Leave a comment