సోదరుడిగా ఆలింగనం చేసుకుంటా..కానీ..! వరుణ్‌ గాంధీపై రాహుల్‌..

Get real time updates directly on you device, subscribe now.

సోదరుడిగా అతన్ని కలిసి ఆలింగనం చేసుకుంటా.. కానీ, ఆయన సిద్ధాంతాన్ని మాత్రం ఎన్నడూ సమర్థించనని స్పష్టం…

హ్యూమన్ రైట్స్ టుడే/న్యూదిల్లీ/17 జనవరి 2023: ఇందిరా గాంధీ మనవడు, భాజపా ఎంపీ వరుణ్‌ గాంధీ (Varun Gandhi) భాజపాలో కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. అయితే, సొంత పార్టీపైనే విమర్శలు గుప్పిస్తోన్న ఆయన.. ఇటీవల కాంగ్రెస్‌లో చేరతారనే వార్తలు వచ్చాయి. ఈ పరిణామాల నడుమ రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. సోదరుడిగా అతన్ని కలిసి ఆలింగనం చేసుకుంటా.. కానీ, ఆయన సిద్ధాంతాన్ని మాత్రం ఎన్నడూ సమర్థించనని స్పష్టం చేశారు. భారత్‌ జోడో యాత్రలో భాగంగా పంజాబ్‌లో పాదయాత్ర చేస్తున్న రాహుల్‌ గాంధీ.. విలేకరులు అడిగిన ఓ ప్రశ్నకు ఈ విధంగా స్పందించారు.

‘వరుణ్‌ గాంధీ భాజపాలో ఉన్నారు. ఇక్కడకు వస్తే ఆయనకు సమస్యే. ఆయన సిద్ధాంతంతో నేను ఏకీభవించను. నేను మాత్రం తలైనా నరుక్కుంటా కానీ, ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యాలయానికి వెళ్లను. మా కుటుంబానికో సిద్ధాంతం ఉంది. కానీ, వరుణ్‌ ఆర్‌ఎస్‌ఎస్‌ భావజాలాన్ని అలవరచుకున్నాడు. ఆరెస్సెస్‌ మంచి పని చేస్తోందని చాలా ఏళ్ల క్రితమే నాకు చెప్పే ప్రయత్నం చేశాడు. అయితే, మన కుటుంబం దేని గురించి నిలబడిందో తెలుసుకుంటే దాన్ని నువ్వు అంగీకరించవని వరుణ్‌తో ఆనాడే చెప్పాను’ అని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ పేర్కొన్నారు.

దేశంలోని అన్ని వ్యవస్థలను తమ ఆధీనంలోకి తెచ్చుకునేందుకు భాజపా, ఆరెస్సెస్‌లు యత్నిస్తున్నాయని రాహుల్‌ గాంధీ ఆరోపించారు. మీడియా, ఎన్నికల సంఘం, న్యాయవ్యవస్థతోసహా అన్ని వ్యవస్థలపైనా ఒత్తిడి ఉందని దుయ్యబట్టారు. ఇక ఆమ్‌ఆద్మీ పార్టీపై విమర్శలు గుప్పించారు. పంజాబ్‌ ప్రభుత్వం ఇక్కడి (పంజాబ్‌) నుంచే నడవాలన్న ఆయన.. దిల్లీ నుంచి కాదని అన్నారు. ప్రస్తుతం ఒక రాజకీయ పార్టీ, మరో పార్టీకి మధ్య పోరాటం లేదని.. వ్యవస్థల మధ్య పోరాటం జరుగుతోందని రాహుల్‌ గాంధీ ధ్వజమెత్తారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a comment