ఫలితాలపై స్పందించిన జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌

Get real time updates directly on you device, subscribe now.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై స్పందించిన జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌
హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/డిసెంబర్ 03:
తెలంగాణతో సహా ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్ స్పందించారు. ఆయా రాష్ట్రాల్లో ఎన్నికల్లో విజయకేతనం ఎగుర వేసిన బీజేపీ అగ్ర నాయకత్వానికి, విజయం కోసం అహర్నిశలు కృషి చేసిన నాయకులకు, కార్యకర్తలకు అభినందనలు తెలిపారు జనసేన అధినేత. ‘మూడు రాష్ట్రాల్లో విజయం సాధించడం భవిష్యత్తు ఫలితాలకు గొప్ప దిక్సూచిగా భావిస్తున్నాను. తెలంగాణ ఓటర్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఎన్నికలలో ప్రజలు ఇచ్చిన తీర్పుని స్వాగతిస్తున్నాను. ఈ ఎన్నికలలో విజయం సాధించిన బీజేపీ అభ్యర్థులతోపాటు విజేతలందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియచేస్తున్నాను. బీజేపీ – జనసేన కూటమిని గౌరవించి, ఆదరించి ఓటు వేసిన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా నమస్కరిస్తున్నాను. తెలంగాణ రాష్ట్రంలో పోటీ జనసేనకు ఒక ప్రత్యేక మైలు రాయిగా నేను భావిస్తున్నాను. తెలంగాణలో పోటీ జనసేన రాజకీయ నాయకత్వ నిర్మాణానికి ఎంతో మేలు చేస్తుందని నేను భావిస్తున్నాను. ఏ లక్ష్యంతో అయితే తెలంగాణ ఆవిర్భవించిందో లక్ష్య సాధనకు జనసేన కృషి జరుపుతుందని తెలియ చేస్తున్నాను. తెలంగాణలో ఎన్నికైన నూతన ప్రభుత్వానికి శుభాకాంక్షలు’ అని పవన్‌ కల్యాణ్‌ పేర్కొన్నారు.

కాగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పవన్‌ కల్యాణ్‌ జనసేన ఎలాంటి ప్రభావం చూపలేకపోయింది. బీజేపీతో పొత్తులో భాగంగా ఆ పార్టీ అభ్యర్థులు పోటీ చేసిన 8 చోట్ల ఓడిపోయారు. కూకట్‌ పల్లి, కోదాడ, తాండూరు, ఖమ్మం, కొత్తగూడెం, అశ్వారావు పేట, వైరా, నాగర్ కర్నూల్ స్థానాల్లో జనసేన అభ్యర్థులు బరిలోకి దిగారు. అయితే కూకట్‌ పల్లిలో మినహా అన్ని చోట్ల జనసేన అభ్యర్థులు డిపాజిట్లు కోల్పోయారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a comment