కేబినెట్ భేటీ..అసలు మతలబు ఏంటి?

Get real time updates directly on you device, subscribe now.

ఈనెల 4న తెలంగాణ కేబినెట్ భేటీ..

అసలు మతలబు ఏంటి?
హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/డిసెంబర్ 01:
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. డిసెంబర్ 3న భవితవ్యం తేలనుంది. అయితే ఫలితాలు రాకముందే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. డిసెంబర్ 4న డా.బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో కేబినెట్ సమావేశం నిర్వహించాలని కేసీఆర్ తలపెట్టారు. ఈ మేరకు తెలంగాణ సీఎంవో కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. అయితే ఫలితాలు వెల్లడి కాకముందే కేసీఆర్ కేబినెట్ భేటీ ఏర్పాటు చేయాలన్న నిర్ణయంపై అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. గెలుస్తామని విశ్వాసమా.. లేదా ఓడిపోతామని అపనమ్మకంతో ఆయన ఈ మీటింగ్ పెడుతున్నారా అంటూ రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. అసలు కేబినెట్‌లో ఉన్న మంత్రులు ఈ ఎన్నికల్లో గెలుస్తారా అని ఒకవైపు బీఆర్ఎస్ శ్రేణులు టెన్షన్ పడుతుంటే కేసీఆర్ కేబినెట్ మీటింగ్ ఎలా పెడతారని పలువురు నోరెళ్లబెడుతున్నారు.
అటు పోలింగ్ ముగిసిన వెంటనే వచ్చిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లో ఎక్కువ శాతం బీఆర్ఎస్‌కు ప్రతికూలంగా ఉండటంతో ఆ పార్టీ శ్రేణులు కలవరపడుతున్నాయి. అయినా బీఆర్ఎస్ నేతలు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలకు భిన్నంగా అసలు ఫలితాలు ఉంటాయని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. హంగ్ వస్తే మిత్రపక్షాలతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని ధీమా బీఆర్ఎస్ నేతల్లో కనిపిస్తోంది. మరోవైపు ప్రగతి భవన్‌లో బీఆర్ఎస్ సీనియర్ నేతలతో సీఎం కేసీఆర్ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా మనమే మరోసారి రాష్ట్రానికి సుపరిపాలన అందించబోతున్నామని కేసీఆర్ అన్నారు. ఎందుకు పరేషాన్ అవుతున్నారని.. రెండు రోజులు నిమ్మలంగా ఉండాలని కేసీఆర్ తమ పార్టీ సీనియర్ నేతలకు సూచించారు. 3వ తేదీన అందరం కలిసి సంబరాలు చేసుకుందామని కేసీఆర్ స్పష్టం చేశారు. ఇప్పటికే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా తాము హ్యాట్రిక్ కొట్టబోతున్నామని పార్టీ శ్రేణులకు సమాచారం ఇస్తున్నారు. ఎగ్జిట్ పోల్స్ బుల్‌షిట్ అని.. గతంలోనూ ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తప్పు అయ్యాయని.. తమకు ఎగ్జిట్ పోల్స్‌తో పనిలేదని.. ఎగ్జాట్ పోల్స్ తమకు అనుకూలంగా వస్తాయని కేటీఆర్ విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a comment