అఫిడవిట్ సమర్పించిన ఎల్లారెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి మదన్మోహన్
హ్యూమన్ రైట్స్ టుడే/కామారెడ్డి/నవంబర్ 27:
ప్రత్యర్థులకు చెమటలు పట్టిస్తున్నారు ఎల్లారెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి మదన్మోహన్. ఇప్పటికే సొంత మేనిఫెస్టో, రూపాయి జీతం, కమిషన్ తీసుకోనంటూ డిక్లరేషన్ ప్రకటించిన ఆయన తాజాగా మరో అస్త్రాన్ని సందించారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం ఆరు గ్యారెంటీలను కచ్చితంగా అమలు చేస్తానని అఫీడవిట్లో పేర్కొన్నారు. ఎల్లారెడ్డి నియోజకవర్గ అభివృద్ధి కోసం పూర్తిగా అంకితం అవుతానని, నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటానని, సమస్యలన్నీ పరిష్కరిస్తానని అందులో తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాలే పరమావధిగా పనిచేస్తూ తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడుతానన్నారు. ఎలాంటి అవినీతికి పాల్పడకుండా నిజాయితీగా, పారదర్శకంగా పనిచేస్తానని, ఎల్లారెడ్డి నియోజకవర్గంతో పాటు రాష్ట్ర ప్రగతి కోసం కృషి చేస్తానన్నారు. పట్టణంలోని స్థానిక సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం కాంగ్రెస్ అభ్యర్థి మదన్మోహన్ తన అఫిడవిట్ ని మీడియాకు విడుదల చేశారు.