హ్యూమన్ రైట్స్ టుడే/నాగర్ కర్నూల్/నవంబర్ 27:
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచిన బర్రెలక్క అలియాస్ కర్నె శిరీషకు మద్దతు పెరుగుతోంది. నిరుద్యోగుల గొంతుకగా.. కొల్లాపూర్ నియోజవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా ఆమె పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.
ఆమెకు నిరుద్యోగ సంఘాలతో పాటు తెలుగు రాష్ట్రాల్లోని పలువురు మేధావులు ఆమె వెన్నంటే ఉన్నామని అంటున్నారు. రెండ్రోజుల క్రితం కొల్లపూర్ వెళ్లిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ఆమె తరపున నియోజకవర్గంలో ప్రచారం కూడా నిర్వహించారు.
తాజాగా మరోసారి బర్రెలక్క శిరీష గెలవాల్సిన అవసరం ఉందని జేడీ లక్ష్మీనా రాయణ అన్నారు. ఆమెను గెలిపించి భారత రాజ్యాంగానికి వన్నె తేవాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
ప్రధాన పార్టీలు తమ అభ్యర్థులను పక్కకు తప్పించి.. బర్రెలక్కకు మద్దతుగా నిలవాలన్నారు. ఏపీలోని మంగళగిరివి.జె. కాలేజీలో జరిగిన రాజ్యాంగ దినోత్సవంలో లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రజలకు చేసిన హెచ్చరికలను ప్రస్తావించారు. ప్రజాస్వామ్యంలో కుటుంబ పాలన, వ్యక్తి పూజలు రాచరికానికి దారితీస్తాయని అన్నారు.
మనకోసం మనం రాసుకున్న రాజ్యాన్ని పరిరక్షించాలంటే, ఎన్నికల్లో డబ్బున్న వారికి కాదు… ప్రజా సమస్యలపై అవగాహన ఉన్న సామాన్య యువతకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు.
అందుకే తాను కొల్లాపూర్ బర్రెలక్క కోసం ప్రచారం చేసానని చెప్పారు. ఎన్నికలు సమీపించిన దృష్ట్యా ఇప్పటికైనా ప్రధాన పార్టీలు తమ అభ్యర్ధులతో బర్రెలక్క విజయానికి కృషి చేయాలని జేడీ పిలుపునిచ్చారు.
బర్రెలక్క ఈ ఎన్నికల్లో విజయం సాధిస్తే.. దేశంలో ఓ విప్లవం మెుదలవుతుందని చెప్పారు.
పార్టీల తరపున పోటీ చేసే అభ్యర్థులు పార్టీల కోసం పని చేస్తారని.. బర్రెలక్క లాంటి వారు మాత్రమే ప్రజల కోసం పని చేస్తారని అన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బర్రెలక్క గెలవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.