అది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు..

Get real time updates directly on you device, subscribe now.

ఎవరు వచ్చినా ధరణిని బాగు చేయాల్సిందే!
హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్:
ఎవరు ఎన్ని మంచి మాటలు చెప్పినా మార్పు రాలేదు, ఎంత అరిచి గోల చేసినా చెవికి ఎక్కలేదు. ధరణిలో రైతులకు అవసరమైన మార్పులు చేయమని ఎన్నో విజ్ఞప్తులు చేశారు. కానీ ఏదీ జరగలేదు. ఎప్పటికప్పుడు ఏదో ఒక టెక్నికల్‌గా, కొన్ని మాడ్యుల్స్ అంటూ ఏదో మార్పులు, వెసులుబాట్లు, కల్పిస్తున్నట్లు భ్రమలు కల్పించారు. వాటిని స్థానిక పత్రికలలో వచ్చేలా చేసారు. తీరా పోర్టల్లో చూస్తే ఎవరికీ ఏ ప్రయోజనం జరిగేట్టు లేదు. ఒక చిన్న కమతం ఉన్న రైతు కానీ ఒక అసైనీ కానీ, నాకు మంచి జరిగింది అన్న సమాచారం అయితే లేదు.

పాత పట్టాదారుల భూములు, ఈ మధ్యనే కొనుగోలు చేసిన భూములు ఏ పొలాన్నైనా ప్రపంచంలో ఏ మూల నుండైనా వెబ్‌సైట్ ఓపెన్ చేసి మన పట్టా భూములను చూసుకోవచ్చు; టాంపరింగ్, దిద్దుబాట్లు, కొట్టివేతలు, డబుల్ రిజిస్ట్రేషన్, విస్తీర్ణాలను ముట్టుకోవటం ఉండదు అన్నారు. పట్టాదారు అనుమతి లేకుండా అక్షరం మారదు రిజిస్ట్రేషన్ రోజునే మ్యుటేషన్ జరిగిపోతుందన్నారు. పట్టాదారు పాసు పుస్తకం అప్పటికప్పుడే జనరేట్ అవుతుంది, అమ్మిన వారి నుంచి అమ్మినంత పొలాన్ని తగ్గించి చూపుతుంది, రెవెన్యూ రికార్డులలోకి చేరిపోయి ధరణి అనే పోర్టల్లోకి ఎక్కబడుతుంది అన్నారు. ధరణికి అజమాయిషీ ఎవరూ లేరు, యజమాని కూడా ఎవరూ ఉండరు, పోర్టల్ అనేది తనకు తానే యజమాని అన్నారు.

ఇవన్నీ వినటానికి ఇంత బాగా ఉన్నప్పుడు నాంపల్లి హైదరాబాదులోని ప్రధాన భూ కమిషనర్ ఆఫీసు చుట్టూ, ఆయా జిల్లాల కలెక్టర్, ఆర్డీఓ, తాసిల్దారు ఆఫీసుల చుట్టూ వందలు వేలమంది బాధితులు ఎందుకు తిరుగుతున్నారు. ఎవరికి అర్థం కాని ప్రధాన అంశం– ధరణి పోర్టల్‌కు చట్టబద్ధత ఎందుకు లేదు? పొరపాట్లు ఎక్కడ ఎవరు చేసినా ఏ స్థాయి అధికారికి విన్నవించుకోవాలో తెలియని పరిస్థితి నెలకొని ఉన్నది. కింది స్థాయి తప్పుకు పై స్థాయిలో ఎవరు జవాబుదారీ అనేది ఎక్కడా ఉండదు. పాసు పుస్తకంలో దొర్లిన తప్పులు, అక్షర దోషాలు, విస్తీర్ణాల్లో తేడాలు ఇలాంటి విషయాల్లో ఎవరిని సంప్రదించాలో తెలియదు. వీటన్నింటినీ పరీక్షించి చూస్తే ప్రభుత్వానికి ఇదంతా తెలిసే చేస్తున్నదని భావించవలసి వస్తున్నది.

ముందుగా 33కాలమ్‌లు (గడీలు), తదనంతరం 18 కాలామ్‌లు (గడీలు) కుదించి ఉన్న పహాని పుస్తకంలో వివరాలన్నీ ఉండేవి. పట్టాదారు పాసుపుస్తకం, టైటిల్ డీడ్, అంటే రైతు దగ్గర పాస్ పుస్తకం తహసీల్దారు కార్యాలయంలో పహాని పుస్తకం, రైతు స్థానికంగా కబ్జాలో ఉంటున్న విస్తీర్ణాలు, ఇవన్నీ సరిచూసుకొని రైతు సంతృప్తి చెందేవాడు. ఇప్పుడున్న ధరణి పుస్తకంలో ఆక్యుపేషన్ లేదా ఆక్రమణ కాలమ్ లేకుండా చేయడం సరైన నిర్ణయం కాదు. ధరణి పుస్తక రూపంలో రాకమునుపే ప్రభుత్వంలోనివారు ‘మనం ఇల్లు కిరాయికి ఇస్తే అతని పేరు ఉండాలంటే ఎలా కుదురుతుంది’ అంటూ వెటకారంగా మాట్లాడారు. అద్దె ఇంటికీ కౌలుకు దున్నే భూమికీ ఎలా పోలుస్తారు! కౌలు రైతు ఇంటిల్లిపాదీ పనిచేయాలి, పెట్టుబడి పెట్టాలి, పంట తీయాలి, పట్టాదారుకు కౌలు ఇవ్వాలి, తాను బ్రతకాలి. మనం నాలుగు మెతుకులు తింటున్నది కౌలు రైతుల శ్రమ వల్లనే. మోకాలికి బోడి గుండుకు ముడిపెట్టి వెక్కిరించి మరీ ఆక్రమణ కాలమ్ తొలగించారు. ఆక్రమణ కాలమ్‌ను ధరణి పోర్టల్‍లో లేకుండా పుస్తకాన్ని పంపిణీ చేసింది తెలంగాణ ప్రభుత్వం.

మేము రైతు కుటుంబం, మాది వ్యవసాయ కులం, మా వృత్తి వ్యవసాయం అంటూ పరోక్షంగా కుల ప్రచారం చేసుకుని ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ జీవిస్తున్నవారు ఎవరూ వ్యవసాయం చేయడం లేదు. వీరికి వ్యవసాయం గిట్టుబాటు కాదని ఏనాడో అర్థమైంది. కాబట్టి వారి పొలాలను అదే గ్రామస్థులైన పేద బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, కొన్నిచోట్ల మైనారిటీలకు కౌలుకి ఇచ్చారు. వీరు మహా నగరాలకు వలసలు వచ్చి మంచి నివాస స్థలం, మంచి విద్యతో ముందు కెళుతున్నారు. అక్కడి పొలాల నుంచి వచ్చే ఆదాయం తీసుకుంటూ, ఇక్కడ ఉద్యోగాలు, వ్యాపారాలు చేసుకుంటున్నారు. కౌలుకు ఇవ్వబడిన భూమికి ప్రభుత్వ రాయితీలు, రుణమాఫీలు, బ్యాంకుల్లో రుణాలు, ధరణి తదనంతరం ఇస్తున్న రైతుబంధు అన్నీ పట్టాదారుకు అధికారికంగా బదిలీ అవ్వడం ఎంతవరకు సమంజసం. తెలంగాణ వచ్చాక కౌలు రైతులకు ఏ అర్హత లేదు. అందుకే రైతు ఆత్మహత్యలు మన రాష్ట్రంలో ఎక్కువగా నమోదు అవుతున్నాయి.

ఏ ప్రభుత్వం వచ్చినా ‘ధరణి’లోని సాంకేతిక లోపాలను ఇతరత్రా పొరపాట్లను సరిదిద్దవలసిందే. లేదంటే రైతులు మరింత నష్టపోయే ప్రమాదం ఉంది. కౌలు రైతులు, అసైన్మెంట్ రైతులు, కొలతల కష్టాలను భరించే వారందరూ పోర్టల్ కష్టాలపై ఏకగ్రీవ తీర్మానాన్ని చేయాలి. ధరణి, దానికి తోడైన కష్టాలను దూరం చేస్తామని హామీ ఇచ్చినవారికే ఓట్లు వేస్తామని చెప్పాలి.

ముందుగా తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి ఇంచు భూమిని కొలిచి ప్రతి పట్టాదారుకు టైటిల్ గ్యారెంటీ ఇస్తున్నట్లు హామీ దొరకాలి. 2018–19 కచ్చా పహాణీ పుస్తకం గ్రామాల్లో తిరిగి ఇంటి పేర్లు కులం, మతం తదితర వివరాలన్నీ సరిదిద్దాలి. ప్రతి ఏటా జమాబంది జరగాలి. ధరణి పోర్టల్‌కు చట్టబద్ధత కల్పించాలి. ఆర్డీఓ– జాయింట్ కలెక్టర్ పనులు తిరిగి కొనసాగించాలి. ప్రతి జిల్లాకు రెవెన్యూ ట్రిబ్యునళ్లు ఏర్పాటు చేయాలి. ఎనభై శాతం పనులు తహశీల్దారు వారి కార్యాలయంలోనే జరగాలి. తహశీల్దారుకు జాయింట్ రిజిస్టర్ పనులు ఉండకూడదు. ప్రతి గ్రామానికీ రెవెన్యూ పనులకు గాను ఒక బాధ్యుడిని నియమించాలి. ఆక్రమణ కాలమ్‌ను పునరుద్ధరించి కౌలు రైతులను ఆదుకోవాలి. సబ్సిడీ విత్తనాలు, సబ్సిడీ ఎరువులు, పంట అమ్ముకునే హక్కులు వీటన్నింటి కొరకు చట్ట సవరణ చేయాలి. ప్రజలుగా మనం ఏమీ అడగకుండా ప్రేక్షకులుగా ఉండిపోతే పాలకులు నియంతలు అవుతారు. అది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు.
వి బాలరాజు
తహశీల్దారు రిటైర్డ్

Get real time updates directly on you device, subscribe now.

Leave a comment