హ్యూమన్ రైట్స్ టుడే/న్యూఢిల్లీ/అక్టోబర్ 11:
దేశంలోనే అత్యంత సంపన్నుడిగా రిలయన్స్ ఇండ్రస్ట్రీస్ చైర్మన్ ముకేష్ అంబానీ నిలిచారు. అదానీ గ్రూపు చైర్మన్ గౌతమ్ అదానీ స్థానంలో ముకేష్ అంబానీ మొదటి స్థానాన్ని దక్కించుకున్నారు.
ఒన్ వెల్త్ హురన్ ఇండియా రిచ్ లిస్ట్ 2023లోని 360 మంది అత్యంత పంపన్నులలో మొదటి స్థానం ముకేష్ అంబానీకి దక్కింది.
గత దశాబ్ద కాలంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ మొత్తం పెట్టుబడులు 150 బిలియన్ డాలర్లను దాటాయి. దేశంలోనే ఇవి అత్యధిక పెట్టుబడులు. ఇదే కాలంలో 66 ఏళ్ల ముకేష్ అంబానీ సంపద నాలుగు రెట్టు పెరిగింది. 2014లో రూ. 1,65,100 కోట్ల నుంచి రూ. 8,08,700 కోట్లకు పెరిగింది.
కాగా..అదానీ గ్రూపు చైర్మన్ 61 సంవత్సరాల గౌతమ్ అదానీ రెండవ స్థానానికి పడిపోయారు. ఏడాది కాలంలోనే ఆయన సంపద రూ.6,19,000 కోట్లు ఆవిరైపోయింది.
ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సిన్ ఉత్పత్తి సంస్థ సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా వ్యవస్థాపకుడు సైరస్ పూనావాలా(82) మూడవ స్థానంలో నిలిచారు. ఆయన సంపద గత ఏడాది కాలంలో 36 శాతం అంటే రూ.73,100 కోట్లు పెరిగింది.
నాలుగవ స్థానంలో నిలిచిన హెచ్‌సిఎల్ చైర్మన్ శివ్ నాడార్(78) సంపద గత ఏడాది కాలంలో 23 శాతం పెరిగి రూ.2,23,900 కోట్లకు చేరుకుంది.
ఐదవ స్థానంలో నిలిచిన గోపీచంద్ హిందూజా అండ్ ఫ్యామిలీ సంపద 7 శాతం పెరుగుదలతో రూ.1,76,500 కోట్లకు చేరుకుంది.
భారత్‌లోని అతిపెద్ద ఫార్మసీ కంపెనీ సన్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ వ్యవస్థాపకుడు దిలీప్ షాంఘ్వీ(68) ఆరవ స్థానంలో నిలిచారు. ఆయన సంపద 23 శాతం పెరుగుదలతో రూ.1,64,300 కోట్లకు చేరుకుంది.
ఆర్సెలర్ మిట్టల్‌కు చెందిన ఎల్‌ఎన్ మిట్టల్ అండ్ ఫ్యామిలీ(73) ఏడవ స్థానంలో నిలిచారు. ఆయన సంపద 7 శాతం పెరిగి రూ.1,62,300 కోట్లకు చేరుకుంది.
8వ స్థానంలో నిలిచిన అవెన్యూ అపార్ట్‌మెంట్స్ అధిపతి రాధాకృషన్ దామని(68) సంపద 18 శాతం తగ్గి రూ. 1,43,900 కోట్ల వద్ద నిలిచింది.
ఆదిత్య బిర్లా గ్రూపునకు చెందిన కుమార్ మంగళం బిర్లా అండ్ ఫ్యామిలీ(56) 9వ స్థానంలో నిలిచారు. ఆయన సంపద 5 శాతం పెరుగుదలతో రూ.1,25,600 కోట్లకు చేరుకుంది.
10వ స్థానంలో బజాజ్ గ్రూపునకు చెందిన నీరజ్ బజాజ్ అండ్ ఫ్యామిలీ నిలిచారు. ఆయన సంపద 7 శాతం పెరుగుదలతో రూ. 1,20,700 కోట్లకు చేరుకుంది.