హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/అక్టోబర్ 11:
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్-2 పరీక్షలు మళ్లీ వాయిదా పడ్డాయి. ఈ సారి వాయిదాకు రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల హడావుడే కారణం కావడం గమనార్హం..! 783 గ్రూప్-2 పోస్టుల భర్తీకి టీఎ్‌సపీఎస్సీ గత ఏడాది నోటిఫికేషన్(28/2022)ను జారీ చేయగా.. 5.51 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.
టీఎస్ పీఎస్సీ తొలుత ఈ ఏడాది ఆగస్టు 29, 30 తేదీల్లో పరీక్షలకు షెడ్యూల్‌ను ఖరారు చేసింది. వరుసగా ఇతర పోటీ పరీక్షలు కూడా ఉండడంతో.. గ్రూప్-2ను వాయిదా వేయాలంటూ నిరుద్యోగులు, రాజకీయ పార్టీల నుంచి డిమాండ్లు వచ్చాయి.
అప్పట్లో ఆందోళనలు ఉధృతమవుతున్న తరుణంలో పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు టీఎ్‌సపీఎస్సీ ప్రకటించింది. నవంబరు 2, 3 తేదీల్లో గ్రూప్-2ను నిర్వహిస్తామని పేర్కొంటూ.. అందుకు ఏర్పాట్లను చేస్తోంది.
తెలంగాణతోపాటు..ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం(సీఈసీ) సోమవారం ప్రకటన చేయడం.. నవంబరు 3న ఎన్నికల నోటిఫికేషన్ ఉండడంతో టీఎ్‌సపీఎస్సీ పునరాలోచనలో పడింది. దీంతో మంగళవారం టీఎస్ పీఎస్సీ చైర్మన్ బి.జనార్దన్‌రెడ్డి నేతృత్వంలో సుదీర్ఘ సమావేశం జరిగింది.
అప్పటికే.. ఎన్నికల నోటిఫికేషన్ నేపథ్యంలో నామినేషన్లు, ఇతర పనుల కారణంగా సిబ్బందిని సమకూర్చలేమంటూ జిల్లాల కలెక్టర్లు టీఎ్‌సపీఎస్సీకి తెలిపారు.
అదేవిధంగా ఎన్నికల విధులు, నగదు,బంగారం,మద్యం,తాయిలాల తరలింపుపై నిఘా పెట్టాలని, సరిహద్దు చెక్‌పోస్టుల్లో నిరంతరాయంగా పనిచేయాల్సి ఉంటుందని, అభ్యర్థుల భద్రత, ఇతర అంశాల నేపథ్యంలో గ్రూప్-2 పరీక్ష కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు సాధ్యం కాకపోవచ్చంటూ ఎస్పీలు వివరించారు.
ఈ అంశాలను పరిగణనలోకి తీసుకున్న టీఎ్‌సపీఎస్సీ.. గ్రూప్-2 పరీక్షలను వాయిదా వేయాలని నిర్ణయించింది. వచ్చే ఏడాది జనవరి 6, 7 తేదీల్లో ఆ పరీక్షలను నిర్వహిస్తామంటూ టీఎ్‌సపీఎస్సీ కార్యదర్శి అనితారామచంద్రన్ మంగళవారం ఓ ప్రకటనను విడుదల చేశారు.