ఇది చాలా అన్యాయం,అమానుషం
………….
ఒకప్పుడు షాపింగ్ కి వెళ్తే మనకి వస్తువులు చూపించే సేల్స్ గర్ల్స్, సేల్స్ బాయ్స్ కూర్చోడానికి చిన్నచిన్న స్టూల్స్ లాంటివి ఉండేవి. కస్టమర్స్ ఎవరూ లేకపోతే వాళ్ళకి కూర్చోగలిగిన వెసులుబాటు ఉండేది. దాదాపు ఒక పది సంవత్సరాల నుండి సేల్స్ సెక్షన్స్ లో పనిచేసే వారు ఎనిమిది నుంచి పది గంటల వరకు నిలబడే ఉండాల్సిన పరిస్థితి ఈ రోజు మనం గమనిస్తున్నాం. పెద్దపెద్ద మాల్స్ కెళ్ళినా, సూపర్ బజార్లకు వెళ్లినా ఇవే దృశ్యాలు చాలా కాలంగా మనకు కనబడుతున్నాయి. షాపింగ్ కి వెళ్ళినప్పుడు ఒక అరగంట గంట నిలబడాల్సి వచ్చినప్పుడు విపరీతంగా కాళ్ల నొప్పులు నడుం నొప్పితో నీరసం వస్తుంది.
అసలు ఈ మాల్స్, పెద్ద పెద్ద హైపర్ మార్కెట్స్ లో పనిచేస్తున్న వేలాదిమంది యువతీ యువకులు ఎనిమిది గంటలు ఎలా నిలబడగలుగుతారు. ఇలా నిలబడే ఉండి కస్టమర్స్ తో వ్యవహరించాలి అనే రూల్ ఏమన్నా ఉన్నదా. లేబర్ డిపార్ట్మెంట్ ఈ అంశం మీద దృష్టి పెట్టినట్టుగా కనబడలేదు. ఏదైనా షాప్ కు వెళ్ళినప్పుడు సేల్స్ లో ఉండే ఈ పిల్లల్ని చూసినప్పుడు చాలా బాధనిపిస్తుంది. ఎవరైనా ఎనిమిది గంటలు నిలబడి పనిచేయడం అనేది చాలా అమానుషం.
వాళ్ళు ఇచ్చే చిన్న చిన్న జీతాలకు గత్యంతరం లేని పరిస్థితులలో ఇలాంటి ఉద్యోగాలు చేయడానికి ముందుకొస్తున్న ఎంతోమంది యువతీ యువకులకు మాల్స్, సూపర్ మార్కెట్లో పనిచేయడం వల్ల చాలా ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం చాలా ఉంది. కాళ్ల నొప్పులు, నడుం నొప్పి, మెడ నొప్పి ఇవన్నీ కూడా వాళ్లని కుంగ తీసే పరిస్థితి ఉన్నది కానీ తప్పనిసరి పరిస్థితుల్లో వేలాదిమంది ఇలాంటి ఉద్యోగాల్లో కొనసాగుతున్నారు.
ఈ అంశం మీద ఇప్పుడిప్పుడే కొంతమంది మాట్లాడుతున్నారు. వారికి కనీస మానవ హక్కులు కూడా లేకుండా అన్ని గంటలసేపు నిలబడి పని చేయించుకోవడం చాలా అన్యాయమే కాక అమానుషం కూడా. మనందరం ఈ అంశం మీద మాట్లాడదాం. వారికి సపోర్టుగా నిలబడదాం. లేబర్ డిపార్ట్మెంట్లో ఈ అంశమై కంప్లైంట్ ఇవ్వాలని నేను అనుకుంటున్నా. వారిని ఉద్యోగాల్లోకి తీసుకున్నప్పుడు ఇలాంటి షరతులు ఏమైనా విధిస్తున్నారా. అసలు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇస్తున్నారా. ఇలాంటి అంశాలను కూడా మనం పరిశీలించాల్సి ఉంటుంది. అందరం ఈ అంశం మీద పోస్టులు పెడదాం ఇది నా రిక్వెస్ట్.