హ్యూమన్ రైట్స్ టుడే/నిజామాబాద్/సెప్టెంబర్ 07:
దశాబ్దాల పసుపు రైతుల కల త్వరలోనే నెరవేరనుంది. తెలంగాణలో అత్యధికంగా పసుపు పండించే నిజామాబాద్ జిల్లాలో పసుపు బోర్డు ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఈ మేరకు వచ్చే నెలలో మోడీ పర్యటన సందర్భంగా బోర్డును ప్రారంభించడానికి సంబంధిత కేంద్ర మంత్రిత్వ శాఖ ఎంపీ ధర్మపురి అర్వింద్ కు సూత్రప్రాయంగా సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. గత కొన్ని సంవత్సరాలుగా నిజామాబాద్ రాజకీయాలను పసుపు బోర్డు ఏర్పాటు అంశం షేక్ చేస్తున్న విషయం తెలిసిందే.
2019 ఎన్నికల్లో నిజామాబాద్ ఎంపీగా ఉన్న కవితను ఓటమి పాలు చేసింది కూడా పసుబోర్డు అంశమే. 2014 పార్లమెంట్ ఎన్నికలలో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చిన కవిత దాన్ని నెరవేర్చకపోవడంతో వందలమంది రైతులు 2019 పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థులుగా బరిలో నిలిచి ఆమె ఓటమికి కారణమయ్యారు.
అదే ఎన్నికల్లో అర్వింద్ తాను ఎంపీగా గెలిచిన ఐదు రోజుల్లో పసుపు బోర్డును తెప్పిస్తానని బాండ్ పేపర్ పై రాసిచ్చినప్పటికీ బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దేశంలోని అన్ని రకాల బోర్డులను రద్దు చేసిన విషయం తెలిసిందే.