హ్యూమన్ రైట్స్ టుడే/లక్నో/16 జనవరి 2023 : బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి కీలక నిర్ణయం తీసుకున్నారు. 2024 పార్లమెంట్ ఎన్నికలతో పాటు వివిధ రాష్ట్రాల్లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్‌పీ ఒంటరిగా పోటీ చేస్తుందని ప్రకటించారు. ఎన్నికల్లో ఏ పార్టీతోనూ పొత్తులు పెట్టుకోబోమన్నారు. మాయా నేడు తన 67వ పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియా ప్రతినిధులతో ముచ్చటించారు. కాంగ్రెస్‌తో సహా పలు పార్టీలు తమతో పొత్తుకు యత్నిస్తున్నాయని, అయితే ఆ పార్టీల సిద్ధాంతాలు, తమ పార్టీ సిద్ధాంతమూ వేరని ఆమె స్పష్టం చేశారు.
బీఎస్పీ యూపీలో నాలుగు సార్లు అధికారం చేపట్టిందని మాయా గుర్తు చేశారు. పేద ప్రజల కోసం పనిచేసిందన్నారు. తన అధినాయకత్వంలో వివిధ వర్గాలకు చెందిన నాయకులంతా తమ పార్టీలో చేరుతున్నారని చెప్పారు. రాబోయే అన్ని ఎన్నికల్లోనూ ఈవీఎంలు వాడొద్దని, బ్యాలెట్ పేపర్ ద్వారానే ఎన్నికలు జరగాలని ఆమె డిమాండ్ చేశారు. ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసేందుకు అవకాశముందని ఆమె అనుమానం వ్యక్తం చేశారు.