విపత్తు నిర్వహణ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలి: ధర్మాసనం
హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్ /సెప్టెంబర్ 06:
తెలంగాణా లో రెండు రోజులుగా నగరంలో కురుస్తున్న వర్షాలు, పొంగిపొర్లుతున్న నాలాల కారణంగా ఒక మహిళ, ఒక మైనర్ బాలుడు చనిపోయిన ఘటనలను హైకోర్టు సీజే దృష్టికి తీసుకెళ్ళిన న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ ప్రభుత్వానికి తగిన ఆదేశాలు ఇవ్వాలని కోరారు.
రెండు నెలల క్రితం కురిసిన భారీ వర్షాలు, గోదావరి వరదల కారణంగా 41 మంది చనిపోయారని, కేంద్ర వాతావరణ శాఖ నుంచి నిర్దిష్టమైన అలర్ట్ వార్నింగ్ వచ్చినా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని గుర్తుచేశారు.
విపత్తు నిర్వహణ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చి నాలుగైదు రోజులు కాకముందే తాజా వానలతో నగరంలోని గాంధీనగర్‌లో లక్ష్మి అనే మహిళ, ప్రగతినగర్‌లో నితిన్ అనే బాలుడు నాలాల్లో పడి చనిపోయారని గుర్తుచేశారు.
విపత్తు నిర్వహణ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలంటూ ఒకవైపు హైకోర్టు ఆదేశాలను ఉన్నా వాటిని ప్రభుత్వం పట్టించుకోలేదని, తాజాగా వాతావరణ కేంద్రం హెచ్చరించినా జీహెచ్ఎంసీ ముందు జాగ్రత్త చర్యలు చేపట్టలేదని చీఫ్ జస్టిస్‌కు రాసిన లేఖలో చిక్కుడు ప్రభాకర్ గుర్తుచేశారు.
హైకోర్టు గత వారం ఇచ్చిన ఆదేశాలను తు.చ. తప్పకుండా అమలు చేసేలా, ప్రాణ నష్టం జరగకుండా చూసేలా మరోసారి ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని తాజా లేఖలో విజ్ఞప్తి చేశారు.