హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్ /16 జనవరి 2023: హైదరాబాద్ మహానగరంలో కూకట్‌పల్లిలో దారుణం జరిగింది. కేపీహెచ్‌బీ పోలీసు స్టేషన్ పరిధిలో భర్త కారణంగా తన బిడ్డను చంపుకోలేక ఐటీ ఉద్యోగి స్వాతి ఆత్మహత్య చేసుకుంది. భర్త వేధింపులు భరించలేక భవనం 23వ అంతస్తు నుంచి దూకి మృతిచెందింది.
వివరాల ప్రకారం.. శ్రీధర్, స్వాతి ఇద్దరు దంపతులు. వీరికి అంగవైకల్యంతో ఓ కుమారుడు జన్మించాడు. దీంతో, అంగకవైకల్యంతో ఉన్న కుమారుడిని చూస్తూ తట్టుకోలేకపోయాడు. ఈ క్రమంలో మెర్సీ కిల్లింగ్ కోసం తండ్రి శ్రీధర్.. భార్య స్వాతిపై ఒత్తిడి తీసుకువచ్చాడు. ఈ విషయమై తరచూ భార్యను వేధింపులకు గురిచేశాడు. భర్త ఎంత ఒత్తిడి తెచ్చిన కన్న కొడుకును చంపుకోలేక మెర్సీ కిల్లింగ్ ప్రతిపాదనను స్వాతి ఒప్పుకోలేదు.
కుమారుడి విషయంలో భర్త ఇలా వేధించడం భరించలేక స్వాతి మనోవేదనకు గురైంది. దీంతో, వారు నివాసం ఉంటున్న మంజీర ట్రినిటి హోమ్స్ 23వ అంతస్తు నుంచి దూకి స్వాతి సోమవారం ఆత్మహత్య చేసుకుంది. ఇదిలా ఉండగా స్వాతి మృతదేహాన్ని తీసుకునేందుకు కూడా శ్రీధర్ అందుబాటులోకి రాలేదు. కనీసం శ్రీధర్, అతడి కుటుంబ సభ్యులు కూడా మృతదేహాన్ని తీసుకువెళ్లలేదు. ఈ నేపథ్యంలో శ్రీధర్‌ను కఠినంగా శిక్షించాలని స్వాతి బంధువులు కోరుతున్నారు.