చిత్తూరు జిల్లా పలమనేరులో ఘోరం..
కాలువలో పురిటి బిడ్డ ఏడుపులు విని ఆసుపత్రి తరలించిన స్థానికులు
హ్యూమన్ రైట్స్ టుడే/చిత్తూరు జిల్లా /పలమనేరు/సెప్టెంబర్ 03:
సంతానం లేక ఎంతో మంది దంపతులు పడుతున్న వేదన వర్ణనాతీతం. అలాంటిది సంతాన భాగ్యం కలిగిన తర్వాత ఆడపిల్ల అని తెలియడంతో రోడ్డు పాలు చేస్తున్నారు. కొంతమంది అమ్మ అని పిలిపించుకునేందుకు ఆరాటపడుతుంటే మరికొందరు పుట్టిన బిడ్డలను రోడ్లపై, చెత్త కుప్పలలో పడిసి చేతులు దులుపుకుంటున్నారు. ఇలాంటి ఘటనే చిత్తూరు జిల్లా పలమనేరులో చోటుచేసుకుంది. ఆడ శిశువు ఏడుపులు విన్న స్థానికులు వెంటనే పాపను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. స్థానికులు తెలిపిన వివరాల మేరకు పలమనేరు ఏరియా ఆసుపత్రి ఆనుకుని ఉన్న కెవి స్ట్రీట్ మురుగు కాలువలో పసిపాప ఏడుపులు వినిపించడంతో వెంటనే పాపను రక్షించి ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం శిశువు పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. పాపను ఎవరూ వదిలి వెళ్లారో తెలుసుకునేందుకు సీసీ కెమెరాలు పోలీసులు పరిశీలిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.