హ్యూమన్ రైట్స్ టుడే/తూప్రాన్ /సెప్టెంబర్ 03: తాగొచ్చి తీవ్రంగా వేధిస్తున్నాడని భర్తను కట్టేసి భార్య చిత్రహింసలకు గురి చేయగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటన మెదక్ జిల్లా తూప్రాన్ మండలం ఘనపూర్‌లో శనివారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు దొడ్ల నర్సింలు, అనంతమ్మ దంపతుల కుమారుడు దొడ్ల చిన్నవెంకటేశ్(36) కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఇతడికి భార్య విజయ, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వెంకటేశ్ కొంత కాలంగా మద్యానికి బానిసయ్యాడు. ఈ క్రమంలో భార్యాపిల్లలను వేధిస్తున్నాడు. ఈ విషయమై పలుమార్లు తూప్రాన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా పోలీసులు కౌన్సెలింగ్ సైతం ఇచ్చారు. అతడి తీరులో మార్పు రాకపోవడంతో కోపోద్రిక్తులైన విజయ తన బంధువులతో కలిసి శుక్రవారం అతడిని ఘనపూర్‌లో తమ ఇంటి ముందున్న మరో ఇంట్లో కట్టేశారు. అతని శరీరం, మర్మంగాలపై యాసిడ్‌తో పాటు వేడి తేనీరు పోసినట్లు గాయాలు ఉన్నాయి. కళ్లలో కారం పొడి పోసి కాళ్లు, చేతులు కట్టేసి రాత్రంతా గదిలోనే బంధించారు. శనివారం ఉదయం విజయ హైదరాబాద్‌లో ఉంటున్న వెంకటేశ్ తల్లిదండ్రులకు ఫోన్ చేసి.. వెంకటేశ్ తనను, పిల్లలను కొడుతున్నాడని, కట్టేసి గదిలో ఉంచామని సమాచారం ఇచ్చింది. వారు వచ్చి చూసేసరికి వెంకటేశ్ తీవ్ర గాయాలతో పడి ఉన్నాడు. అతడిని బయటకు తీసుకొచ్చేందుకు యత్నించగా విజయ ఒప్పుకోలేదు. దీంతో తల్లిదండ్రులు, అతడి సోదరి సత్యలక్ష్మి.. గ్రామస్థుల సాయంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు ఘటనాస్థలికి చేరుకొని వెంకటేశ్‌ను తూప్రాన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చేతులు, కాళ్లు కట్టేయడంతో పాటు శరీరంపై యాసిడ్ పోయడంతో చర్మం మొత్తం ఊడిపోయింది. మర్మంగాల వద్ద తీవ్ర గాయాలవగా చికిత్స అందిస్తుండగానే మృతి చెందాడు. తమ కుమారుడిని అతడి భార్య విజయ, పిల్లలు బంధువుల సాయంతో దాడి చేసి చంపేశారని వెంకటేశ్ తల్లిదండ్రులు ఆరోపించారు. ఈ విషయమై తూప్రాన్ సీఐ శ్రీధర్‌ను వివరణ కోరగా.. ఫిర్యాదు అందిందని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామన్నారు. ఎవరెవరు దాడి చేశారన్నది త్వరలోనే వెల్లడిస్తామని వివరించారు.