సింగరేణి కార్మికులకు త్వరలో వేజ్ బోర్డు ఏరియర్స్ : డైరెక్టర్ బలరామ్
హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/సెప్టెంబర్ 02:
సింగరేణి కార్మికులకు చెల్లించాల్సిన 23 నెలల 11వ వేజ్‌బోర్డు బకాయిలను వీలైనంత త్వరగా చెల్లించేందుకు ముమ్మర ఏర్పాటు జరుగుతున్నాయి. ప్రాథమిక అంచనా ప్రకారం రూ.1,726 కోట్ల బకాయిలు చెల్లించనున్నామని, దీంతో ఒక్కో కార్మికుడు సగటున రూ.4 లక్షల వరకు ఎరియర్స్ అందుకుంటాడని సింగరేణి డైరెక్టర్ ఎన్ బలరామ్ శుక్రవారం సాయంత్రం ప్రకటించారు.
కార్మికులకు ఇంత పెద్ద మొత్తంలో బకాయిలను చెల్లించడం సింగరేణి చరిత్రలో ఇదే తొలిసారని, ఈ బకాయిలను నెల రోజుల వ్యవధిలో రెండు విడతలుగా కార్మికుల ఖాతాల్లో జమ చేయనున్నామని వెల్లడించారు.
పర్సనల్, అకౌంట్స్, ఆడిటింగ్, ఈఆర్పీ, ఎస్‌ఏపీ, ఐటీ తదితర విభాగాల సమన్వయంతో శుక్రవారం నుంచే వేతన బకాయిల లెకింపు ప్రక్రియను ప్రారంభించినట్టు తెలిపారు.
తొలుత వేతన బకాయిలకు సంబంధించిన ఆడిటింగ్‌ను, ఆ తర్వాత మిగిలిన ప్రక్రియలను వేగంగా పూర్తిచేసి చెల్లింపులకు మార్గం సుగమం చేయాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించినట్టు వివరించారు.
ముందే చెల్లించేందుకు కృషి వేతన బకాయిలను నెల రోజుల్లోపే చెల్లించాలని ప్రాథమికంగా అనుకుంటున్నప్పటికీ అంతకన్నా ముందే చెల్లించేందుకు కృషి చేస్తున్నట్టు బలరామ్ తెలిపారు. 11వ వేజ్ బోర్డు సిఫారసులను అందరికన్నా ముందే సింగరేణిలో అమలు జరిపామని, దీంతో సంస్థపై ఏటా దాదాపు రూ.1,200 కోట్ల అదనపు భారం పడుతున్నదని పేర్కొన్నారు.
దీనికి రూ.1,726 కోట్ల ఎరియర్స్‌ను కూడా కలిపితే మొత్తం దాదాపు రూ.3 వేల కోట్లు అవుతుందని తెలిపారు. తొలుత ఉద్యోగంలో ఉన్న కార్మికులకు, ఆ తర్వాత పదవీ విరమణ చేసిన కార్మికులకు బకాయిలు చెల్లించనున్నట్టు చెప్పారు.