లోక్‌సభ ఎన్నికల్లో కలిసే పోటీ.. ‘ఇండియా’ కూటమి తీర్మానం
హ్యూమన్ రైట్స్ టుడే/ముంబయి/సెప్టెంబర్ 01: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార ఎన్డీయేను ఢీకొట్టేందుకు ఏర్పాటైన ‘ఇండియా’ (I.N.D.I.A) కూటమి మూడో సమావేశం ముంబయిలో రెండో రోజు కొనసాగుతోంది.
28 పార్టీలకు చెందిన అగ్రనేతలు హాజరైన ఈ కీలక భేటీలో వచ్చే ఎన్నికల నాటికి ఉమ్మడి పోరుకు చేయాల్సిన సన్నద్ధతపై సమాలోచనలు జరుపుతున్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కలిసే పోటీ చేయాలని కూటమిలోని పార్టీలు తీర్మానం చేశాయి. ఇందులో భాగంగా 14 మందితో సమన్వయ కమిటీ ఏర్పాటు చేసింది. కూటమికి సంబంధించి అత్యున్నత నిర్ణయాలు తీసుకొనే కమిటీగా ఇది వ్యవహరించనుంది..
రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో సాధ్యమైనంత వరకు కలిసి పోటీ చేయాలని ‘ఇండియా’ కూటమిలోని పార్టీలు తీర్మానించాయి. వివిధ రాష్ట్రాల్లో సీట్ల సర్దుబాటు ప్రక్రియ తక్షణమే ప్రారంభించనున్నట్టు ఈ మేరకు సంయుక్తంగా ఓ ప్రకటన విడుదల చేశాయి. సహకార స్ఫూర్తితో త్వరగా ఈ ప్రక్రియ పూర్తి చేయనున్నట్టు ఓ ప్రకటనలో వెల్లడించింది. దేశంలోని ప్రజా సమస్యలపై వివిధ ప్రాంతాల్లో బహిరంగ సభలు నిర్వహించనున్నారు. అలాగే, వివిధ భాషల్లో “జుడేగా భారత్, జీతేగా ఇండియా” అనే థీమ్‌తో ప్రచార వ్యూహాలను సమన్వయం చేసుకొని పనిచేయనున్నట్టు పేర్కొంది. సెప్టెంబర్ 30 నాటికి సీట్ల సర్దుబాటు చేసే అంశాన్ని పూర్తి చేసేలా పనిచేయనున్నట్టు సమాచారం..
సమన్వయ కమిటీ సభ్యులు వీళ్లే..
‘ఇండియా’ కూటమి సమన్వయ కమిటీలో కాంగ్రెస్ నుంచి కేసీ వేణుగోపాల్, ఎన్సీపీ నేత శరద్ పవార్, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్, ఆర్జేడీ నుంచి తేజస్వీ యాదవ్, తృణమూల్ కాంగ్రెస్ నుంచి అభిషేక్ బెనర్జీ, శివసేన నుంచి సంజయ్ రౌత్, జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్, ఆప్ నేత రాఘవ్ చద్దా, సమాజ్ వాదీ పార్టీ నుంచి జావేద్ అలీ ఖాన్, జేడీయూ నుంచి లలన్ సింగ్, సీపీఐ నేత డి.రాజా, నేషనల్ కాన్ఫరెన్స్ నుంచి ఒమర్‌అబ్దుల్లా, పీడీపీ నుంచి మెహబూబా ముఫ్తీ ఉన్నట్టు సమాచారం. ఈ అత్యున్నత నిర్ణాయక కమిటీ తక్షణమే సీట్ల పంపకాలపై కసరత్తు ప్రారంభించనుంది.