రైతులకు మరింత చేరువగా ధరణి పోర్టల్ కార్యాచరణ: రంగంలోకి రెవెన్యూ శాఖ
హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/సెప్టెంబర్ 01:
విపక్షాలకు ఎటువంటి విమర్శలకు ఎన్నికల ఏడాదిలో తావులేకుండా చేస్తున్న సర్కార్ ధరణి లోటుపాట్లపై దృష్టిసారించింది. స్వల్ప లోపాలను అధిగమించి అద్భుతంగా రైతులకు సాయమందించేలా ధరణి పోర్టల్‌ను తీర్చిదిద్దుతోంది. ఇందులో భాగంగానే అనేక అంశాలపై అధ్యయనం చేసి లోపాలను వేగంగా తీరుస్తోంది.
తాజాగా నిషేదిత భూముల జాబితా క్లీయరెన్స్‌లో ప్రభుత్వం వేగం పెంచింది. అన్ని జిల్లాల కలెక్టర్లు తమవద్ద ఉన్న ధరణి రికార్డులలోని జాబితాను మండల తహశీల్దార్‌లకు పంపించి వివరాలు తెప్పించుకున్నారు.
ఈ రికార్డులను సీసీఎల్‌ఏకు చేరవేసి సుమోటోగా పరిష్కరిస్తున్నారు. ఇలా పాస్ పుస్తకాలు జారీ అయినప్పటికీ నిషేదిత జాబితాలో ఉన్నవాటినే పంపించగా, వీటికి కూడా కొందరు క్లీయరెన్స్ కోరుతూ దరఖాస్తులు చేయలేదు. దీంతో స్వతహాగా ప్రభుత్వమే క్లీయర్ చేయాలని నిర్ణయించడంతో ఈ పని వేగంగా జరుగుతోంది.
11 లక్షల ఎకరాల భూములకు హక్కులులేవని పాస్ పుస్తకాలు నిరాకరించిన హక్కుల కల్పన దిశగా ప్రభుత్వం కార్యాచరణ చేస్తోంది. ఇంకా మరో 3.5లక్షల మందికి పెండింగ్‌లకు చెందిన పాస్ పుస్తకాల జారీతోపాటు 2.5లక్షల మంది రైతులకు చెందిన రికార్డుల తప్పుల సరిజేత దిశగా శ్రమిస్తోంది.
తాజాగా తీసుకొచ్చిన టీఎం 33 మ్యాడ్యూల్‌కు అనుబంధంగా మరో 8 మాడ్యూల్స్ అందుబాటులోకి తెచ్చారు. వీటన్నింటికి చెందిన దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ, నోటీసుల జారీ పురోగతిలో ఉంది.
ప్రధానంగా పేరులో మార్పులు, చేర్పులు, విస్తీర్ణంలో మార్పులు, సర్వే నెంబర్ తొలగింపు, ఎన్వోసి, ఓఆర్సీ, 38ఈ, 13బి, సర్వే నెంబర్‌ను భిన్నమైన ఖాతాలకు మళ్లించడం, అసైన్డ్ భూములను పట్టాభూములుగా రికార్డుల మార్పు, ల్యాండ్ నేచర్, ల్యాండ్ టైప్ మార్చడం, మిస్సింగ్ నెంబర్, కొత సర్వే నెంబర్‌ను సృష్టించడం, కొత్త ఖాతా సృష్టి, లావాదేవి నిలుపుదల, ఖాతాల విలీనం వంటి వాటిపై స్పష్టత రావడంతో మెజారిటీ సమస్యలు పరిష్కారమవుతున్నాయి.
భూసేకరణలో భాగంగా ప్రభుత్వం సేకరించిన భూముల సర్వే నెంబర్లలలోని మొత్తం పట్టా భూములను నిషేదిత జాబితాలో చేర్చడం, కోర్టు కేసులు, ఇతర వివాదాలున్న సర్వే నెంబర్లను ఈ జాబితాలో ఉంచడం, వివిధ కారణాలతో రాష్ట్రవ్యాప్తంగా ధరణి పోర్టల్‌లో కొన్ని సర్వే నెంబర్లలోని భూములు నమోదు కాలేదు.
ఈ మిస్సింగ్ డేటాను సేత్వార్, ఖాస్రా పహాణీలో ఉన్న విస్తీర్ణం కంటే తక్కువగా ఉండే వాటి నమోదుకు అవకాశం కల్పించి ఆయా రైతులు రైతుబంధు, రైతు భీమా పథకాలకు అర్హులుగా మార్చాలని ప్రయత్నిస్తోంది.