ములుగు జిల్లాలో మరోసారి మావోయిస్ట్ లేఖలు..
హ్యూమన్ రైట్స్ టుడే/ములుగు జిల్లా/ఆగస్టు 31:
ములుగు జిల్లాలో మరోసారి మావోయిస్టుల లేఖలు కలకలం సృష్టించాయి. వాజేడు మండలం జగన్నాథపురం జంక్షన్‌లో గురువారం ఉదయం ప్రత్యక్షమయ్యాయి.
ధరణి పోర్టల్‌తో రైతులను దివాళా తీశారని లేఖలో పేర్కొన్నారు. గ్రామాల్లో వ్యవసాయ విప్లవం రాబోతోందని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ప్రభుత్వాలు ప్రజలను అన్ని రకాలుగా పీడిస్తున్నాయని మండిపడ్డారు. పాత, కొత్త భూస్వాములు, కాంట్రాక్టర్లు, గ్రామ పరిపాలకవర్గం కలిసి ఒక వ్యవస్థగా ఏర్పడి ప్రజలను అన్ని రకాలుగా దోచుకుంటున్నారని విమర్శించారు.
పోలీస్ స్టేషన్లు పంచాయితీలు చేసే అడ్డాలుగా మారాయని లేఖలో ప్రస్తావించారు. మావోయిస్టు లేఖపై పోలీసులు విచారణ చేస్తున్నారు. ఇటీవల ధరణి పోర్టల్ పై ఒకవైపు కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేస్తోంది. ఇదిలా ఉండగా.. ధరిణి పోర్టల్ ద్వారానే రైతులకు మేలు జరుగుతుందని అధికార బీఆర్ఎస్ పార్టీ చెబుతోంది.
ఈ నేపథ్యంలో ఒక్కసారిగా మావోయిస్టులు ములుగు జిల్లా వాజేడు రహదారిపై ధరణి పోర్టల్ పై లేఖ, కరపత్రాలను విడుదల చేశారు. ఈ లేఖ, కరపత్రాలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి.