ఈ నెల 29, 30, 31 తేదీల్లో ప్రతి రోజూ వెయ్యి బస్సుల చొప్పున..
హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్ /ఆగస్టు 27:
రాఖీ పౌర్ణమి సందర్భంగా ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులను టీఎస్‌ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఆదేశించారు.
రక్షాబంధన్‌కు రాష్ట్రవాప్తంగా 3 వేల ప్రత్యేక బస్సులను నడిపించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఈ ప్రత్యేక సర్వీసులను ఈ నెల 29, 30, 31 తేదీల్లో ప్రతి రోజూ వెయ్యి బస్సుల చొప్పున నడపనున్నట్లు పేర్కొన్నారు.
రాఖీ పౌర్ణమికి ప్రత్యేక బస్సుల ఏర్పాటు, ప్రయాణికులకు కల్పించాల్సిన సౌకర్యాలపై అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సజ్జనార్ సమీక్షించారు.
ఈ సందర్భంగా సజ్జనార్ మాట్లాడుతూ రాఖీ పౌర్ణమికి హైదరాబాద్ నుంచి కరీంనగర్, నిజామాబాద్, హన్మకొండ, ఖమ్మం, నల్లగొండ, మహబూబ్‌నగర్, గోదావరిఖని, మంచిర్యాల, తదితర రూట్‌లలో రద్దీకి అనుగుణంగా ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు.
ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే జేబీఎస్, ఎంజీబీఎస్ బస్ స్టేషన్ లతో పాటు ఉప్పల్, ఎల్బీనగర్, ఆరాంఘర్ ప్రాంతాల్లో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి.. ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.