పారిశ్రామిక వేత్తలుగా మహిళలు ఎదగాలన్నదే ప్రభుత్వ లక్ష్యం : మంత్రి ఎర్రబెల్లి
హ్యూమన్ రైట్స్ టుడే/వరంగల్ జిల్లా/ ఆగస్టు 24:
దేశంలో డ్వాక్రా సంఘాలను బలోపేతం చేస్తున్నది మన మహిళలే. రాష్ట్రంలో లాగా దేశంలో ఎక్కడా మహిళలు ఆర్థికంగా ఎదగలేదు. మిగతా రాష్ట్రాలలో పరిస్థితులు మరింత అధ్వానంగా ఉన్నాయని పంచాయతీరాజ్ శాఖమంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.
జనగామ జిల్లా పాలకుర్తి గ్రామ పంచాయతీ పరిధిలోని మహిళా స్వయం సహాయక సంఘాలకు సంబంధించి 6 గ్రామైక్య సంఘాల మహా సభలు పాలకుర్తిలోని ఓ ఫంక్షన్ హాలులో జరిగాయి.
ఈ మహా సభలకు మంత్రి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కాంగ్రెస్ పాపాల ఫలితంగానే ప్రజలు కష్టాల పడాల్సి వస్తుందన్నారు.
బీజేపీ పాలనలో మరింత దిగజారిన పరిస్థితి మనం చూస్తున్నాం. అందుకే సీఎం కేసీఆర్ ఎంతో కష్టపడి పని చేయాల్సి వస్తున్నదని పేర్కొన్నారు. మహిళలు పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని వెల్లడించారు.
మహిళలు ఆర్థికంగా ఎదిగితే, ఆ కుటుంబం, సమాజం, గ్రామం రాష్ట్రం, దేశం, ప్రపంచమే బాగు పడుతుందని తెలిపారు. అనంతరం మహిళా సంఘాలకు ఐదు కోట్ల రూపాయల విలువైన రుణాలను అందజేశారు.
ఈ కార్యక్రమంలో ఎర్రబెల్లి ట్రస్ట్ చైర్ పర్సన్ ఉషా దయాకర్ రావు, మహిళా సంఘాల పాలక వర్గ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.