తెలంగాణా గురుకుల విద్యార్థుల సరికొత్త రికార్డ్..
హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/ఆగస్టు 24:
తెలంగాణ ప్రభుత్వం గురుకుల విద్యార్థుల కోసం చేపట్టిన ఆపరేషన్ బ్లూ క్రిస్టల్ ప్రాజెక్టు సరికొత్త చరిత్రను సృష్టిస్తున్నది.
నీట్ మొదటి విడత కౌన్సిలింగ్‌లోనే సాంఘిక, గిరిజన సంక్షేమ గురుకులాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు. మొదటి విడత కౌన్సెలింగ్‌లోనే దాదాపు 180 మంది ఎంబీబీఎస్ సీట్లు సాధించారు.
సోషల్ వెల్ఫేర్ గురుకులాల నుంచి 135 మంది, గిరిజన గురుకులాల నుంచి 45 మంది సీట్లు పొందారు. వీరిలో రెగ్యులర్ ఇంటర్ విద్యార్థులు 30 మంది, లాంగ్‌టర్మ్ నుంచి 105 మంది ఉన్నారు.
తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలకు చెందిన ఐదుగురు విద్యార్థులు కూడా మెడికల్ సీట్లు సాధించారు.
గిరిజన గురుకులాల సత్తా:
గిరిజన గురుకులాల నుంచి గత ఏడాది 41 మంది మెడిసిన్ సీట్లు సాధించగా, ఈసారి 45 మంది సీట్లు పొందారు. వీరిలో 18 మంది బాలికలు ఉన్నారు. రెగ్యులర్ ఇంటర్ నుంచి 8 మంది, లాంగ్‌టర్మ్ నుంచి 37 మంది ఎంపికయ్యారు.
మొదటిసారిగా పర్టిక్యులర్ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ పీవీటీజీ,కు చెందిన విద్యార్థిని సైతం ఎంబీబీఎస్ సీటు సాధించారు. పీవీటీజీకి చెందిన సంగర్సు స్రవంతి కరీంనగర్‌లోని ప్రతిమ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో సీటు దక్కించుకుంది.