చంద్రయాన్-3 సక్సెస్‌లో రామగుండం యువకుడు
హ్యూమన్ రైట్స్ టుడే/రామగుండం /ఆగస్టు 24:
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-3 ప్రయోగం విజయవంతం కావడంలో పెద్దపల్లి జిల్లా రామగుండంకు చెందిన సీనియర్ శాస్త్రవేత్త కేవీఎల్ కార్తీక్ కృషి ఉంది.
ఎన్టీపీసీ టౌన్‌షిప్‌నకు చెందిన కార్తీక్ పదోతరగతి వరకు చిన్మయి విద్యాలయం(ప్రస్తుతం సచ్‌దేవ స్కూల్ ఆఫ్ ఎక్స్‌లెన్సీ)లో చదువుకున్నాడు. అనంతరం విజయవాడలో ఇంటర్, హైదరాబాద్‌లో బీటెక్, బెంగుళూరులో ఎంటెక్ చదివి క్వాల్‌కమ్‌లో ఏడాది పాటు పనిచేశాడు. ఏడేండ్ల క్రితం ఇస్రోలో శాస్త్రవేత్త అయ్యాడు.
కాగా కార్తీక్ తల్లిదండ్రులు కేవీఎల్ సత్యప్రసాద్, రమాదేవి సచ్‌దేవ స్కూల్ ఆఫ్ ఎక్స్‌లెన్సీలో తెలుగు ఉపాధ్యాయులుగా పని చేస్తున్నారు. వీరికి ఇద్దరు సంతానం కాగా పెద్ద కొడుకు కార్తీక్ దేశ ఖ్యాతిని పెంపొందించే ఇస్రోలో శాస్త్రవేత్తగా రాణిస్తున్నాడు.
భారత దేశం సగర్వంగా చెప్పుకునే చంద్రయాన్-3 ప్రయోగం విజయవంతమైన బృందంలో తమ కొడుకు ఉండడంపై తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.