చంద్రయాన్-3 జాబిల్లికి మరింత చేరువగా ల్యాండింగ్!!
హ్యూమన్ రైట్స్ టుడే/శ్రీహరికోట/ఆగస్టు 22:
చంద్రుడిపై మన వ్యోమనౌక అడుగు పెట్టే చారిత్రక క్షణాల కోసం భారతీయులంతా వెయ్యి కండ్లతో ఎదురు చూస్తున్నారు.
చంద్రుడిపై పరిశోధనలకు అంతరిక్షంలోకి దూసుకెళ్లిన చంద్రయాన్-3 లక్ష్య సాధనలో తుది అంకానికి చేరుకున్నది.
బుధవారం సాయంత్రం 6.04 గంటలకు ఈ అపురూప ఘట్టాన్ని ఆవిష్కరించడానికి ఇస్రో అన్ని ఏర్పాట్లు చేసింది. విక్రమ్ లాండర్, ప్రజ్ఞాన్ రోవర్‌తో కూడిన ల్యాండింగ్ మాడ్యూల్ జాబిల్లికి మరింత చేరువలోకి వెళ్లింది.
చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్ అయ్యే చివరి 17 నిమిషాలు అత్యంత కీలకం అని ఇస్రో శాస్త్రవేత్తలు అంటున్నారు.
ఇప్పుడు ల్యాండింగ్ మాడ్యూల్ కదలికలను ఇస్రో శాస్త్రవేత్తలు అనుక్షణం తనిఖీ చేస్తున్నారు. నిర్దేశిత ల్యాండింగ్ ప్రదేశంలో ల్యాండింగ్ కావడానికి సూర్యోదయం కోసం వేచి చూస్తున్నామని ఇస్రో పేర్కొంది.
సూర్యుడి వెలుగు రాగానే సాఫ్ట్ ల్యాండింగ్ ప్రక్రియ చేపడతారు. బుధవారం సాయంత్రం దాదాపు 5.45 గంటల తర్వాత ఈ ప్రక్రియ ప్రారంభిస్తారని అంచనా వేస్తున్నారు.
ల్యాండింగ్ మాడ్యూల్ సాఫ్ట్ లాండింగ్‌లో అత్యంత క్లిష్టమైన ప్రక్రియ.. 17 నిమిషాల టెర్రర్ అని ఇస్రో అధికారులు, నిపుణులు చెప్పారు.
పూర్తిగా స్వతంత్రమైన ఈ ప్రక్రియలో సరైన ఎత్తు, సరైన టైంలో సరిపడా ఇంధనం ఉపయోగించుకుని ల్యాండర్ తన ఇంజిన్లను మండించుకోవాలి. అటుపై తన వేగాన్ని తగ్గించుకుంటుంది. అటుపై సురక్షిత ల్యాండింగ్ కావడానికి సరైన ప్రదేశాన్ని స్వయంగా ల్యాండర్ స్కానింగ్ చేసుకుంటుంది.