మావోనిస్ట్ మల్లా రాజిరెడ్డి మృతిపై రాష్ట్ర ఇంటెలిజెన్స్ రిపోర్ట్

Get real time updates directly on you device, subscribe now.

హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/ఆగస్టు 19:
మావోయిస్టు పార్టీ అగ్రనేత మల్లా రాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్ తీవ్ర అనారోగ్యంతో దట్టమైన అడవిలో చనిపోయినట్లు ఇటీవల మీడియాలో వచ్చిన వార్తలపై రాష్ట్ర ఇంటెలిజెన్స్ పోలీసు వర్గాల నుంచి అనధికార సమాచారం అందింది. చనిపోయింది మల్లా రాజిరెడ్డి కాదని, సోషల్ మీడియా సహా ప్రధాన పత్రికలు, టీవీ ఛానెళ్ళలో వచ్చిన వార్తలు, వైరల్ అయిన వీడియోలో ఉన్నది అతను కాదని అనధికారికంగా ధృవీకరించారు.

మావోయిస్టు వర్గాలు సైతం మల్లా రాజిరెడ్డి మృతి చెందలేదనే చెప్తున్నారు. ఫొటోలు, వీడియోలో ఉన్నది దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు హరఖ్ అలియాస్ శ్రీకాంత్ అని దాదాపుగా ధృవీకరించారు.

గుండెకు సంబంధించిన తీవ్ర అనారోగ్యంతో మైదాన ప్రాంతాల్లో చికిత్స పొందే అవకాశం లేక 2012 ఫిబ్రవరి 26న అడవిలోనే హరఖ్ చనిపోయారని, అప్పటి అతని వీడియో ఇప్పుడు మల్లా రాజిరెడ్డి పేరుతో వైరల్ అవుతున్నదంటూ అటు మావోయిస్టు పార్టీ వర్గాలు మరోవైపు స్టేట్ ఇంటెలిజెన్స్ పోలీసులు గుర్తు చేశారు.

మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ లేదా తెలంగాణ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి పేరుతో ప్రకటన వచ్చిన తర్వాతనే దీనిపై మరింత క్లారిటీ వస్తుందని ఇంటెలిజెన్స్ వర్గాలు పేర్కొన్నాయి.

మల్లా రాజిరెడ్డి చనిపోయారంటూ వస్తున్న వార్తలను స్టేట్ ఇంటెలిజెన్స్ వర్గాలు ఛత్తీస్‌గఢ్ పోలీసుల నుంచి ఆరా తీసినప్పుడు ఆ వీడియో ఇప్పటిది కాదంటూ రిప్లై వచ్చినట్లు గుర్తుచేశారు. పైగా ఆ వీడియోలో ఉన్న వ్యక్తి హరఖ్‌గా తాను ఇప్పటికే గుర్తించామని, ఆ వీడియో పదేళ్ళ కిందటిదంటూ నొక్కిచెప్పారు. దీంతో చనిపోయిన వ్యక్తి మల్లా రాజిరెడ్డి అని ధృవీకరించడానికి ఎలాంటి ఆధారాలు లేకుండా పోయాడని మావోయిస్టు పార్టీ నుంచి ధృవీకరించే తీరులో ప్రకటన వస్తేనే చిక్కుముడి తేలిపోతుందని పేర్కొన్నారు.

మరోవైపు సిద్దిపేట జిల్లా కోహెడ మండలం తీగలగుంటపల్లి గ్రామానికి చెందిన తొలి తరం మావోయిస్టు నేత కట్టా రామచంద్రారెడ్డి దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు మృతి చెందినట్లు వస్తున్న వార్తలపై కూడా ఛత్తీస్‌గఢ్ పోలీసుల నుంచి నిర్దిష్టమైన సమాచారం లేదని గుర్తుచేశారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a comment