*మారిపోతున్నారు మారిపోతున్నారు.*
*మతంమారి పోతున్నారు అని గగ్గోలు పెట్టే మూడు శాతం మూఢులారా!*
హ్యూమన్ రైట్స్ టుడే/శీర్షిక:
ఎందుకు మారిపోతున్నారని నిన్ను నీవు ప్రశ్నించుకున్నావా?
మనమంతా హిందువులంటావ్, బంధువులంటావ్, భరతమాత నుదిటి సింధూర బిందువులంటావ్.
గుడిలోకొస్తే గుడ్డలిప్పదీసి కొడతావ్. ప్రసాదమడిగితే పసివాళ్ళనే కనికరం కూడా లేకుండా పిర్రలపై వాతలు పెడతావ్.
మంచినీళ్ళు తాగినందుకు మరణదండన వేస్తావ్. ఆడబిడ్డలను మాతంగులను దేవదాశీలను చేసి అన్యాయంగా అనుభవిస్తావ్.
మనిషిగా గుర్తించవు సరికదా పశువులకన్నా హీనంగా చూస్తావ్. నువ్వూ ఒక మనిషేవేనన్న సంగతి మరచి పోతావ్.
అద్దెకు ఇల్లివ్వవ్, ప్రేమిస్తే పెళ్ళికి పిల్లనివ్వవ్. పైగా ప్రేమించిన పాపానికి చంపేస్తావ్.
చదువుని, జ్ఞానాన్ని, అర్హతలనూ గుర్తించవ్.
పోస్టుల్లో పక్కన పెడతావ్..
లెక్కల్లో చివరన పెడతావ్..
కడబంతిలోనే ఆకులేస్తావ్..
సాటి మనిషి అనే సోయలేకుండా బ్రతికేస్తావ్.
తలపాగా పెట్టుకుంటే తలతీసేయాలనుకుంటావ్.
గుర్రమెక్కిన నేరానికి గు..పగల తన్నుతావ్.
చెప్పులేసుకుని నిలబడితే సివాలెత్తిపోతావ్. పంచె కట్టుకుంటే పంచాయితీ పెడతావ్.
పట్టుకోక కడితే పిచ్చెక్కి పోతావ్.
క్షణక్షణం కులగోత్రాలు చూస్తావ్.
అవసరానికి వాడుకుంటావ్,
అవసరం తీరాక..
నీ హిందువు అనే నీ బంధువునే
నిమ్నజాతివాడని నిలువులోతు పాతరేస్తావ్.
నికృష్టుడని ప్రచారం చేస్తావ్.
నీ హిందువులైన నీ బంధువులైన అంటరాని వారి సమాధులపై నీ ఆకాశ హ్రమ్యాలకు పునాదులేసుకుంటావ్. మారిపోతున్నారని ఏడ్చే ముందు నిన్ను నువ్వు సంస్కరించుకో.
సర్వ మానవులు సమానమేనన్న నిజంతెలుసుకో. మనిషిని మనిషిగా గుర్తించడం ప్రేమించడం నేర్చుకో.
సమానత్వాన్ని కాదనే అశాస్త్రీయ శాస్త్రాలను తిరగరాసుకో. మతమౌఢ్యం నుంచి కులక్రౌర్యం నుంచీ నువ్వు బయటపడితే చాలు, ఒక్కడు కూడా బయటికిపోడు.
నువ్వు మారకుండా, నిన్నునీవు సంస్కరించుకోకుండా, మనిషిని మనిషిగా చూడకుండా ఉన్నంతకాలం మతమార్పిడి జరుగుతుంది. జరుగుతూనే ఉంటుంది.
ఆపడం నీతరం కాదు కదా
నిన్ను పుట్టించాడని నువ్వు నమ్మే
ఆ బ్రహ్మ తరం కూడా కాదు..