బాధిత కుటుంబాలకు 10 వేల ఆర్థిక సాయం..
హ్యూమన్ రైట్స్ టుడే/న్యూ ఢిల్లీ /జులై 17:
దేశ రాజధాని వాసులకు కాస్త ఊరట కల్పిస్తున్నట్టుగా ఆదివారం సాయంత్రానికి యమునా నదిలో నీటి మట్టం 205.91 మీటర్లకు తగ్గు ముఖం పట్టింది. అయినప్పటికీ నదికి దగ్గర్లోని యమునా బజార్, ఎర్ర కోట, రాజ్‌ఘట్, ఐటీవో, రింగ్ రోడ్ లాంటి ప్రాంతాలు వరదనీటి ముంపులో కొట్టుమిట్టాడుతున్నాయి. అలాగే రాజధాని పరిధిలోని నాలుగు జిల్లాలు ఉత్తర ఢిల్లి, ఆగ్నేయ ఢిల్లి, ఈశాన్య ఢిల్లి, సెంట్రల్ ఢిల్లిలో చాలా ప్రాంతాలు ఇప్పటికీ నీట మునిగి ఉన్నాయి. దీంతో వాహనాల రాకపోకలపై దుష్ప్రభావం పడింది. లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న మొత్తం 25,823 మందిని వరద ముప్పు నుంచి కాపాడినట్టు ప్రభుత్వ అధికారులు తెలిపారు.
వారిలో 23,451 మంది సహాయక, పునరావాస శిబిరాల్లో తలదాచుకున్నారని చెప్పారు. సహాయక శిబిరాన్ని సందర్శించిన సీఎం ఒక్కొక్క వరద బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం రూపేణా రూ.10,000 అందజేస్తామని ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ప్రకటించారు. ”యమునా నది పరివాహక ప్రాంతాల్లో నివసిస్తున్న నిరుపేద కుటుంబాలు తీవ్రంగా నష్టపోయాయి. కొన్ని కుటుంబాలు సర్వస్వం కోల్పోయాయి. ఆయా కుటుంబాలకు ఆర్థిక సాయం రూపేణా రూ.10,000 అందిస్తాం” అని చెప్పారు. వరద నీటిలో ఆధార్ కార్డు, తదితర డాక్యుమెంట్లను కోల్పోయిన వారి కోసం స్పెషల్ క్యాంప్ ఏర్పాటు చేస్తామని తెలిపారు.
యూనిఫామ్‌లు, పాఠ్యపుస్తకాలు కోల్పోయిన పిల్లలకు పాఠశాల శాఖకు చెందిన అధికారులు వాటిని సమకూరుస్తారని చెప్పారు. మోరీ గేట్ సహాయక శిబిరాన్ని కేజ్రీవాల్ ఆదివారం సందర్శించారు. అక్కడ తలదాచుకున్న వరద బాధితులతో మాట్లాడారు. శిబిరంలో కల్పించిన సదుపాయాలను తనిఖీ చేశారు. బాధిత కుటుంబాలను ఆదుకోవడం కోసం స్థానిక పాఠశాలల్లో సహాయక శిబిరాలను ఢిల్లి ప్రభుత్వం నెలకొల్పింది. కరెంటు, నీరు, ఆహారం, మరుగుదొడ్లు లాంటి అన్ని రకాల సదుపాయాలను తమ ప్రభుత్వం సహాయక శిబిరాల్లో కల్పించిందని సీఎం తెలిపారు. బాధిత కుటుంబాలకు పరిహారాన్ని ప్రభుత్వం త్వరలో ప్రకటిస్తుందని చెప్పారు.