త్వరలో క్యూఆర్ కోడ్ స్కానింగ్ విధానం..
హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/జులై 15:
టీఎస్ ఆర్టీసీలో ఎప్పటికప్పుడు కొత్త పథకాలతో ముందుకు వెళుతున్న యాజమాన్యం ప్రయాణికుల ఇబ్బందులను తొలిగించే చర్యలకు శ్రీకారం చుట్టింది. బస్సుల్లో కండక్టర్లు, ప్రయాణికులు ఎదుర్కునే క్యాష్ కష్టాలకు చెక్ పెట్టే దిశగా క్యూఆర్ కోడ్ స్కాన్ సిస్టంను ప్రారంభించనుంది. ఇప్పటికే ఆర్టీసీ సాంకేతిక విభాగం అధికారులు ఈ అంశంపై కసరత్తు దాదాపుగా పూర్తి చేశారు. గత ఏడాది చివరిలోనే నగదు రహిత టికెట్ కొనుగోలు పద్దతిని ప్రవేశపెట్టాలని ఆర్టీసీ అధికారులు భావించారు. అయితే, కొన్ని సాంకేతిక కారణాల వల్ల అంతరాయాలు ఏర్పడ్డాయి.
ప్రయాణికులు టికెట్ కొనుగోలు కోసం క్యూఆర్ కోడ్ ద్వారా చెల్లించిన డబ్బులు ఎవరి బ్యాంక్ ఖాతాలో జమ అవుతాయి ? ఏదైనా కారణం చేత జమ కాని పక్షంలో ఆ డబ్బులకు ఎవరు బాధ్యత వహించాలి ? అనే ప్రశ్నలు తలెత్తాయి. అయితే ఈ సమస్యలన్నింటికీ పరిష్కారంగా కొత్త సాఫ్ట్వేర్ను అభివృద్ధి చేయాలని టీఎస్ ఆర్టీసీ ఉన్నతాధికారులు నిర్ణయించారు. దీనిని ప్రయోగాత్మకంగా సిటీ బస్సుల్లో అమలు చేయాలనే ఆలోచనతో ఆర్టీసీ అధికారులు ఉన్నారు. ఈ విధానం అమలులోకి వస్తే ప్రయాణికులు, కండక్టర్లకు చిల్లరతో వచ్చే సమస్యలు తీరనున్నాయి. కాగా, టీఎస్ ఆర్టీసీ గత ఏడాది పండుగల సందర్భంగా ప్రవేశపెట్టిన అన్ని పథకాలనూ ఈ ఏడాది కూడా అమలు చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం. గత ఏడాది రాఖీ పౌర్ణమి సందర్భంగా ఆర్టీసీ మహిళలకు ప్రత్యేక బస్సు లు నడిపించింది.
దీంతో ఒక్క రాఖీ పౌర్ణమి నాడే దాదాపుగా 40 లక్షల మంది ప్రయాణించారనీ, ఆ ఒక్క రోజే రికార్డ్ స్థాయిలో రూ.20 కోట్ల రాబడి వచ్చింది. అలాగే, ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తీసుకుంటున్న చర్యలలో భాగంగా ప్రయాణికుల నుంచి సలహాలు, సూచనలు స్వీకరిస్తోంది. లేఖలు, ట్విట్టర్ ద్వారా తమ విలువైన సలహాలు ఇవ్వాలని కోరుతోంది. ప్రజా రవాణా వ్యవస్థను మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లడంలో భాగంగా ఆర్టీసీ బస్సుల్లోనే ఎక్కువగా ప్రయాణించే ప్రయాణికుల అభిప్రాయాలను సామాజిక మాథ్యమాల ద్వారా విస్తృతంగా ప్రచారం చేస్తోంది. ఎన్నో ఏళ్లుగా ఆర్టీసీ బస్సులలో ప్రయాణిస్తున్న ప్రయాణికులను సంస్థ తరఫున సన్మానించడం ద్వారా ప్రయాణికులను ఆకర్శించడం చేస్తోంది.