బడికెళ్తుండగా ప్రభుత్వ టీచర్‌దారుణ హత్య

Get real time updates directly on you device, subscribe now.

హ్యూమన్ రైట్స్ టుడే/విజయనగరం /జూలై 16:
వాహనంతో ఢీకొట్టారు. అక్కడినుంచి 100 మీటర్లమేర ఈడ్చుకునిపోయారు. రోడ్డుపక్క రక్తపుమడుగులో విలవిల్లాడుతున్నా వదలలేదు. దాడిచేసి రాడ్లతో కొట్టారు. కర్కశంగా కళ్లు పొడిచేశారు. ఆ తర్వాత చంపేసి నెత్తుటి ముద్దగా మారిన మృతదేహాన్ని అక్కడ పడేసి పోయారు. విజయనగరం జిల్లా రాజాం మండలం కొత్తపేట సమీపంలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిని హత్యచేసిన తీరు ఇది. టీడీపీ సానుభూతిపరుడైన ఆయన తనకు ఇలాంటి పరిస్థితి వస్తుందనే రెండేళ్ల క్రితం వైసీపీలోకి మారారు. అయినా.. రాజకీయ కక్షతో ఆయనను బలి తీసుకున్నారు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు తెర్లాం మండలం ఉద్దవోలు గ్రామానికి చెందిన ఏగిరెడ్డి కృష్ణ (58) అదే మండలం కాలవరాజు పేటలో ప్రభుత్వ ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నారు. కొన్నేళ్లుగా రాజాం పట్టణంలోని గాంధీనగర్‌లో నివాసం ఉంటున్నారు. తెలుగుదేశంపార్టీ ఆవిర్భావం నుంచీ ఆ పార్టీ పట్ల అభిమానం పెంచుకున్నారు. ఐదేళ్ల పాటు ఉద్దవోలు సర్పంచ్‌గానూ పనిచేశారు. ఆతర్వాత ఉపాధ్యాయ వృత్తిలోకి వచ్చారు. అయినా.. గ్రామాభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. అందరి మంచి కోరే మనిషిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన ప్రతిపాదించిన వ్యక్తే ప్రతి ఎన్నికల్లోనూ సర్పంచ్‌గా గెలుస్తూ వస్తున్నారు. ఈసారీ ఆయన బలపరిచిన నేతే సర్పంచ్‌ అయ్యారు. నిజానికి, గ్రామంలో కృష్ణ పలుకుబడిని తగ్గించడానికి ఆయన ప్రత్యర్థి వర్గం తీవ్ర బెదిరింపులకు పాల్పడింది. ‘ప్రభుత్వం మాది. ఎలా గ్రామం బాగుపడుతుందో చూస్తాం’ అంటూ ఆయనపై ఒత్తిడిని బాగా పెంచేశారు. వారి బెదిరింపులకుతోడు, గ్రామాభివృద్ధి ఆగిపోతుందనే కారణంగా రెండేళ్ల క్రితం కృష్ణ వైసీపీకి దగ్గరయ్యారు. అయినా, ఆయనదే మాట గ్రామంలో కొనసాగడం ప్రత్యర్థి వర్గానికి నచ్చలేదు. పైగా ఈ ఏడాది ఎన్నికల్లోనూ కృష్ణ చెప్పిన వ్యక్తే సర్పంచ్‌గా గెలిపారు. దీంతో ఆయనపై ప్రత్యర్థి వర్గం కక్ష పెంచుకుంది. గ్రామంపై పట్టు సాధించాలంటే కృష్ణను అడ్డు తొలగించుకోక తప్పదని నిర్ణయానికి వచ్చింది. కృష్ణను అంతంచేసే అదును కోసం వేచి ఉన్నారు. ఈ క్రమంలో శనివారం ఎప్పటిలాగే రాజాం నుంచి తన ద్విచక్ర వాహనంపై తెర్లాం మండలం కాలవరాజుపేట వైపు కృష్ణ బయలుదేరారు. అప్పటికే అక్కడ మాటువేసిన దుండగులు.. వ్యానుతో వెనగ్గా వెళ్లి కృష్ణ బైకును వేగంగా ఢీకొట్టారు. అంతే వేగంగా కృష్ణను వ్యానుతోపాటు ఈడ్చుకుంటూ పోయారు.

తీవ్రగాయలతో రక్తపు మడుగులో కృష్ణ రోడ్డు పక్కన పడిపోయాడు. వాహనం నుంచి దిగిన వ్యక్తులు.. కృష్ణపై పడి రాడ్లతో బలంగా కొట్టారు. ఆపై కళ్లు పొడిచారు. ‘నన్ను చంపొద్దురా ప్లీజ్‌.. ప్లీజ్‌’ అని రెండు చేతులు ఎత్తి కృష్ణ వేడుకుంటున్నాడు. అలా వేడుకుంటూనే తనువు చాలించాడు. వ్యానును అక్కడే వదిలేసి హంతకులు అక్కడినుంచి వెళ్లిపోయారు.

*యాక్సిడెంట్‌గా భావించి…*

తొలుత ఇది యాక్సిడెంట్‌గా అనుకున్నారు. గంటల వ్యవధిలోనే ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు, అభిమానులు ఘటన స్థలానికి చేరకున్నారు. అక్కడ నెలకొని ఉన్న పరిస్థితులు చూసి వారంతా ఆగ్రహంతో రగిలిపోయారు. ప్రమాదం కాదని…ముమ్మాటికీ హత్యేనని పేర్కొంటూ రోడ్డుపై బైటాయించారు. వైసీపీకి చెందిన మరడాన వెంకట నాయుడు, అతని సోదరుడు మోహనరావులే ఈ హత్య చేశారని, వారిని ఆరెస్ట్‌ చేస్తేనే మృతదేహాన్ని కదిలిస్తామని అక్కడే బైఠాయించారు. దీంతో రాజాం-బొబ్బిలి ప్రదాన మార్గంలో ఇరువైపులా నాలుగు గంటలపాటు వాహనాలు నిలిచిపోయాయి. చీపురుపల్లి డీఎస్పీ శ్రీనివాస చక్రవర్తి… మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు, ఆయా గ్రామాల పెద్దలతో చర్చించారు. ఇది హత్యేనని, హత్యకు కారకులైన వారు ఎంతటివారైనా చర్యలు తీసుకుంటామని డీఎస్పీ స్పష్టం చేయడంతో వారంతా శాంతించారు. కృష్ణ మృతదేహాన్ని రాజాం ఆస్పత్రికి తరలించేందుకు అనుమతించారు. కాగా, కృష్ణ హత్యతో రగిలిపోయిన గ్రామస్థులు.. శనివారం రాత్రి వైసీపీ నేతలకు చెందిన వాహనాన్ని ధ్వంసం చేశారు. గడ్డికుప్పలకు మంటపెట్టారు. కాగా, మరడాన వెంకట నాయుడు, మరడాన మోహనరావు, మరడాన గణపతి, మరడాన రామస్వామిలే తన తండ్రిని హత్యచేసినట్టు కృష్ణ కుమారుడు శ్రావణ్‌కుమార్‌ పోలీసులకు ఫిర్యాదుచేశారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a comment