హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/జూలై 16:
రెవెన్యూ శాఖలోని 21 వేల మందికిపైగా ఉన్న వీఆర్‌ఏ విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్ ల నుంచి దాదాపు 5,950 మందిని నీటిపారుదల శాఖలో సర్దుబాటు చేసేందుకు ప్రభు త్వం సన్నాహాలు చేస్తున్నది. వీఆర్‌ఏలను నీటిపారుదల శాఖలో లష్కర్లుగా నియమించి, పే స్కేల్ వర్తింపజేయాలని ఆ శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. రాష్ట్రంలో భారీగా నిర్మిచిన నీటిపారుదల ప్రాజెక్టుల్లో వీఆర్‌ఏల సేవలు అవసరమని ప్రభుత్వం భావిస్తున్నది. నీరు వృథా పోకుండా ఇప్పటికే టెయిల్ ఎండ్, వారబంది విధానాలతో తక్కువ నీటితో ఎక్కువ విస్తీర్ణానికి సాగులోకి తెచ్చేందుకు విజయవంతంగా కృషి చేస్తున్నది. ప్రాజెక్టుల నిర్వహణ, పర్యవేక్షణకు సాగునీటి పారుదల శాఖను పునర్ వ్యవస్థీకరించింది. అందులో భాగంగా ఆపరేషన్స్ అండ్ మేనేజ్‌మెంట్ విభాగాన్ని ఏర్పాటుచేసి ఇంజినీర్ ఇన్ చీఫ్‌ను కూడా నియమించింది. ఇప్పుడు ఆ విభాగం ప్రాజెక్టుల నిర్వహణకు లష్కర్లను నియమించాలని నిర్ణయించింది.
లష్కర్ల నియామకంతో మరింత బలోపేతం
నీటివృథాను అరికట్టడంలో ప్రాజెక్టులు, కాలువలు, చెరువుల తూములకు సంబంధించి గేట్లు, షట్టర్లు అతి ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి. ఉమ్మడి పాలనలో పర్యవేక్షణ కొరవడంతో చాలా చోట్ల గేట్లు, తూములు తుప్పు పట్టి పోయాయి. రాష్ట్రంలో భారీ, మధ్యతరహా ప్రాజెక్టులకు వెయ్యివరకు గేట్లు ఉండగా.. కాలువలు, తూములకు 15 వేలకు పైగా గేట్లు ఉంటాయని అంచనా. తెలంగాణ ప్రభుత్వమే కొత్తగా 4 వేల వరకు తూములను నిర్మించింది. మొత్తంగా 644 ఎత్తిపోతల స్కీమ్‌లు ఉన్నాయి. వాటన్నింటినీ ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు పకడ్బందీ వ్యవస్థ అవసరం. అందుకోసమే వీఆర్‌ఏలను లష్కర్లుగా నియమించాలని నిర్ణయించినట్టు సమాచారం. ప్రాజెక్టు నుంచి నీటి విడుదల, తూములు, గేట్ల నిర్వహణలో లష్కర్లు కీలకపాత్ర పోషిస్తారు. ఇరిగేషన్ శాఖకు 5,950 మంది లష్కర్లు అవసరమని అధికారులు అంచనా వేశారు.