హ్యూమన్ రైట్స్ టుడే/చేవెళ్ల /జులై 15:
బోనాలు చూడడానికి వచ్చిన దళితుల పై అగ్రకులానికి చెందన సర్పంచ్ దాడి చేసిన సంఘటన చేవెళ్ల మండలంలోని మల్కాపూర్ గ్రామంలో శుక్రవారం రాత్రి జరిగింది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం చేవెళ్ల మండలంలోని మల్కాపూర్ గ్రామంలో బోనాల పండుగ సందర్భంగా శుక్రవారం రాత్రి మైసమ్మకు అగ్రకులస్థులు బోనాల తీసుకెళుతున్నారన్నారు. కాగా ఆ సంబరాలను చూసేందుకు దళిత వర్గానికి చెందిన గండు సంజీవ అక్కడికి వెళ్లాడని తెలిపారు.
దీంతో ఆ గ్రామ సర్పంచ్ శివారెడ్డి, ఆయన బంధువులు, ఆయన అనుచరులు నీవు దళితుడవని ఇక్కడికి ఎందుకు వచ్చావంటూ సంజీవ పై దాడి చేశారన్నారు. ఈ దాడిలో సంజీవకి గాయాలు కావడంతో ఆయన కుటుంబ సభ్యులు చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారని తెలిపారు. అక్కడినుంచి మెరుగైన వైద్యం కోసం భాస్కర్ హాస్పిటల్ కి తరలించారు. విషయం తెలుసున్న ప్రజాసంఘాల నాయకులు చేవెళ్ల పోలీస్ స్టేషన్ ముందుండి శివారెడ్డిని, ఆయన అనుచరులను వెంటనే అరెస్టు చేసి ఎస్సీ, ఎస్టీ కేసునమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.