*తెలంగాణలో పరిస్థితి మరింత దారుణం*
*దేశంలో 72% జిల్లాలు వరద ముంగిట్లో*
*సీఈఈడబ్ల్యూ తాజా నివేదిక*
హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్ /జూలై 14:
తెలుగు రాష్ట్రాలకు తీవ్ర వరద ముప్పు పొంచి ఉంది. అయితే ఏపీ, తెలంగాణల్లో ముందస్తు హెచరిక వ్యవస్థల ఈడబ్ల్యూఎ్‌స లు మాత్రం అరకొరగానే ఉన్నాయి. ఈ విషయంలో తెలంగాణలో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఈ మేరకు ఢిల్లీకి చెందిన ప్రముఖ రీసెర్చ్ సంస్థ కౌన్సిల్ ఆన్ ఎనర్జీ ఎన్విరాన్‌మెంట్ అండ్ వాటర్ (సీఈఈడబ్ల్యూ) గురువారం ఒక నివేదికను విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం… దేశంలోని 12 రాష్ట్రాలు తీవ్ర వరద ముప్పును ఎదుర్కొంటున్నాయి. ఈ జాబితాలో ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, హిమాచల్‌ప్రదేశ్, అసోం, జార్ఖండ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, గోవా, బిహార్ ఉన్నాయి. వీటిలో అసోం, యూపీ, బిహార్‌లలో మాత్రమే ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు తగినంతగా అందుబాటులో ఉన్నాయి. తెలంగాణతో పాటు తమిళనాడు, కర్ణాటక, హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రాల్లో ఈడబ్ల్యూఎస్ లభ్యత అత్యల్పంగా ఉంది. భారీ వరదలతో సతమతమవుతున్న హిమాచల్‌ప్రదేశ్‌నూ ఇదే పరిస్థితి. వరద ముప్పు అంత తీవ్రంగా లేని ఉత్తరాఖండ్‌లో ఈ వ్యవస్థల లభ్యత అత్యధికంగా ఉండగా, యమునా నది ఉధృతి కారణంగా వరదలు ముంచెత్తుతున్న ఢిల్లీ ఈ విషయంలో మధ్యస్థంగా ఉంది.
*ముందస్తు సమాచారం కొందరికే*
దేశవ్యాప్తంగా 72శాతం జిల్లాలు తీవ్రమైన వరద ముప్పును ఎదుర్కొంటున్నాయని సీఈఈడబ్ల్యూ నివేదిక పేర్కొంది. అందులో 25శాతం జిల్లాలు మాత్రమే వరద అంచనా కేంద్రాలు/ ముందస్తు హెచరిక వ్యవస్థలను కలిగి ఉన్నాయని తెలిపింది. అంటే దేశంలో మూడింట రెండొంతుల మంది ప్రజలు తీవ్ర వరదలతో ప్రభావితం అవుతుండగా, ఒక వంతు మందికి మాత్రమే ముందస్తు సమాచారం అందించే అవకాశం ఉంటోంది. మరోవైపు దేశ జానాభాలో 25శాతం మంది తుఫాన్లు, తదనంతర పరిణామాలతో ప్రభావితమవుతుండగా వారిలో నూరు శాతం మందికీ ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు అందుబాటులో ఉన్నాయని నివేదిక వివరించింది. కాగా, ఈడబ్ల్యూఎ్‌సలను విస్తృతంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని దేశంలో ఇటీవల సంభవించిన వరదలు మరోసారి స్పష్టం చేశాయని సీఈఈడబ్ల్యూ సీనియర్ ప్రోగ్రాం లీడ్ డాక్టర్ విశ్వాస్ చితాలే అన్నారు. ప్రజల ప్రాణాలు కాపాడేందుకు రాష్ట్రాలు వీటి ఏర్పాటును వేగవంతం చేయాలని ఆయన సూచించారు.